గడ్డిమందు మరణాలపై స్పందన
సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మానుకోట జిల్లాలో క్షణికావేశం, అప్పులు కావడం, కుటుంబ కలహాలతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా గడ్డి మందు తాగి మరణించిన వారే ఎక్కువగా ఉన్నారు. గడ్డి మందును నిషేధించాలి.. లేదా మెరుగైన చికిత్సను అందుబాటలోకి తేవాలని నవంబర్ 10న ‘సాక్షి’ దినపత్రికలో ‘ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా ఈ కథనం వెలువడిన నాటి నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ గడ్డి మందు అంశాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై రెండు నెలలుగా వివిధ స్థాయి అధికారులు, డాక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో చర్చ జరిగింది. గడ్డి మందు నిషేధంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందుగా గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన వారిని ఎలా రక్షించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది.
పైలెట్ ప్రాజెక్టుగా మానుకోట ఎంపిక
ప్రధానంగా గ్లైఫోసెట్, పండిమిథాలిన్, ప్రిటిల్లాక్లోర్, నామినీ గోల్డ్, అల్‌మిక్స్ వంటి కలుపు మందులు తాగిన వారు బతకడం చాలా కష్టం. అయితే తాగిన రెండు గంటలలోపు ఆస్పత్రికి తరలించి వెంటనే ప్రత్యేక వైద్య చికిత్స అందజేయాలి. ప్రధానంగా పేషెంట్‌కు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా మహబూబాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగాఎంపిక చేసినట్లు శుక్రవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్‌తో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వారం రోజుల్లో రెండు యూనిట్లు మంజూరు చేసి ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే మురళీ నాయక్ ‘సాక్షి’తో తెలిపారు. ఇలా చేయడం వల్ల కొందరి ప్రాణాలైన కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. విన్నపాన్ని మన్నించి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిని రక్షించేందకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మురళీనాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిసి ఎమ్మెల్యే వివరణ
స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
పైలెట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లా ఎంపిక
ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు
గడ్డిమందు మరణాలపై స్పందన
గడ్డిమందు మరణాలపై స్పందన


