కేసీఆర్‌ దుష్టపాలనకు చరమగీతం పాడండి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దుష్టపాలనకు చరమగీతం పాడండి

Nov 15 2023 1:16 AM | Updated on Nov 15 2023 1:16 AM

మామునూరులో జరిగిన వర్ధన్నపేట విజయభేరి సభకు హాజరైన ప్రజలు - Sakshi

మామునూరులో జరిగిన వర్ధన్నపేట విజయభేరి సభకు హాజరైన ప్రజలు

సాక్షి, వరంగల్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌/చిల్పూరు/జనగామ: చరిత్రలో శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం జరిగిన మాదిరి తెలంగాణ పాపాల భైరవుడు కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడుతూ ఇందిరమ్మ రాజ్యం వచ్చే దిశలో కాంగ్రెస్‌ను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో, వరంగల్‌ జిల్లా మామునూరు, తిమ్మాపురం రోడ్డులోని లక్ష్మీపురం మైదానంలో జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో ఆయన మాట్లాడారు. ఈ రెండు నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన సింగపురం ఇందిర, కేఆర్‌ నాగరాజును గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగపురం ఇందిరను గెలిపించే బాధ్యతగా తానొక్కడినే కాకుండా అద్దంకి దయాకర్‌ను ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహిళగా ఇందిరను నిలబెడితే కడియం శ్రీహరి, రాజయ్య మర్యాదపూర్వక విమర్శలను విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. వారికి ప్రజలు ఓటుద్వారా కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. వీరిద్దరికి కేసీఆర్‌ ఉపముఖ్యమంత్రులుగా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత జాతకాలు తెలుసుకుని ఊడగొడితే.. ఒకరి సంగతి ఒకరు స్టేషన్‌లో చెప్పుకోవడం ప్రజలు చూశారన్నారు. వీరిద్దరు కీలక శాఖల్లో పనిచేసి డిగ్రీ కళాశాల, వంద పడకల ఆస్పత్రి తేకపోవడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి పాలకులకు గుణపాఠం చెప్పి ఇందిరను గెలిపిస్తే సత్వరమే ఆ రెండు హామీలను నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలి, కాంగ్రెస్‌ రావాలి, బైబై కేసీఆర్‌ అంటూ సభకు వచ్చిన ప్రజలతో నినదింపజేశారు. జెడ్పీ స్టాండింగ్‌ చైర్మన్‌, ఘన్‌పూర్‌ జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మతిభ్రమించి మాట్లాడుతున్న కడియం:

కాంగ్రెస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి

సింగపురం ఇందిర

కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న విశేష ఆదరణ చూసి ఓటమి భయంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరికి స్థానికత అంటే తెలియకపోవడం విడ్డూరంగా ఉందని, మీకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, అత్తగారు ఊరు స్థానిక ఊరు కాదా, ఇక్కడ నాకు ఓటు ఉందని గుర్తు చేశారు. ఘన్‌పూర్‌కు రేవంత్‌రెడ్డి వస్తున్నాడంటే బీఆర్‌ఎస్‌ వాళ్లకు వణుకు పుడుతుందన్నారు. కడియం శ్రీహరి టీడీపీ హయాంలో 420 మందిని ఎన్‌కౌంటర్లు చేయించారని స్వయంగా హరీశ్‌రావు గతంలో చెప్పారని, ప్రస్తుతం ఆయన కిడ్నాప్‌ల శ్రీహరిగా మారారని ఎద్దేవా చేశారు.

నేను మీవాడినే.. ఆదరించండి: కాంగ్రెస్‌

వర్ధన్నపేట అభ్యర్థి కేఆర్‌ నాగరాజు

‘నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదివాను. ఇక్కడే ఉద్యోగం చేశాను. ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా’ అని కాంగ్రెస్‌ పార్టీ వర్ధన్నపేట అభ్యర్థి కేఆర్‌ నాగరాజు అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అనకొండలాగా తయారైండని, కొండలు.. మట్టి మింగారని ఆరోపించారు. ‘గెరిల్లా లాగా బెదిరిస్తాడు. ఎక్కడ వెంచర్లు ఉంటే అక్కడ రోడ్లు, ల్యాండ్‌ పూలింగ్‌తో మన రైతు సోదరులను పోలీసులతో కొట్టించిండు. రైతు కన్నీరు కారిస్తే దేశానికి అరిష్టం. అర్జునుడిలా రేవంత్‌ రెడ్డి అన్న మనకు ఉన్నాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పేదల పాలన ఉంటుంది’ అని కేఆర్‌ నాగరాజు అన్నారు.

రాష్ట్రంలో మార్పు రావాలి..

కడియం, రాజయ్య గుణగణాలు

అందరికి తెలుసు

ఉపముఖ్యమంత్రి ఉద్యోగం ఇచ్చిన

కేసీఆర్‌ వీరి గురించి తెలిసి

ఊడగొట్టాడు..

ల్యాండ్‌ పూలింగ్‌తో వర్ధన్నపేట

రైతుల మెడపై కత్తి

రైతులను పోలీసులతో తన్నించిన

అరూరి రమేశ్‌

స్టేషన్‌ఽఘన్‌పూర్‌,

వరంగల్‌ (వర్ధన్నపేట) బహిరంగ సభల్లో

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement