కో‘ఆప్షన్‌’ ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

కో‘ఆప్షన్‌’ ఇవ్వండి

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

కో‘ఆప్షన్‌’ ఇవ్వండి

కో‘ఆప్షన్‌’ ఇవ్వండి

సాక్షి, మహబూబాబాద్‌: మున్సిపల్‌ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈమేరకు కో ఆప్షన్‌ పదవులు దక్కించుకునేందుకు ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ పెద్దలు, గాడ్‌ ఫా దర్స్‌ వద్దకు వెళ్లి తమ అభిప్రాయాలను వ్యక్తం చే యడం, ఎమ్మెల్యేల మీద ఒత్తిడి చేసి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతీ మున్సిపాలిటీలో నలుగురు..

జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు, కేసముద్రం, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లో ఒక్కో మున్సిపాలిటీకి నలుగురు చొప్పున కోఆప్షన్‌ సభ్యులను నియమిస్తారు. అయితే ఇందులో ఇద్దరు మైనార్టీలు అందులో ఒకరు మహిళ ఉండాలి. మిగిలిన వారిలో ఒకరు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉన్నవారు.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారు ఉంటారు. ఇలా ప్రతీ మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్‌ సభ్యులు ఉంటే అందులో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని నిబంధన ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీ ఓటరై ఉండి, 21సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

మైనార్టీ సంఘాల్లో చర్చ

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రతీచోట ఇద్దరు మైనార్టీ విభాగానికి చెందిన కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాలి. అయితే ఇందులో ముస్లిం మై నార్టీలు, క్రిస్టియన్‌ మైనార్టీల్లో ఒక్కొక్కరికి అవకాశం దక్కుతుంది. కాగా, ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పెద్దలు మైనార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. పార్టీకి విధేయులుగా ఉండడంతోపాటు, ఆయా విభాగాల ప్రతినిధిగా ఉంటూ సేవలు అందించేవారికి అవకాశం ఇవ్వాలని మైనార్టీ పెద్దలకు కాంగ్రెస్‌ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇందుకోసం మైనార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

నాయకుల చుట్టూ ఆశావహులు..

పాలక మండలిలో ఓటు వేసే అర్హత మినహా మిలిగిన అన్ని ప్రొటోకాల్స్‌ వర్తించే కోఆప్షన్‌ పదవి కోసం ఐదు మున్సిపాలిటీల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా మాజీ ప్రజాప్రతినిధుల కోటలో స్థానం దక్కించుకునేందుకు అధిక సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి దిగి నాయకుల ఆదేశాలతో ఉపసంహరించుకున్నవారు.. పోటీలో ఉండి ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి ఓడిపోయిన వారు.. బలవంతంగా పోటీలోకి దిగి ఓడిపోయిన వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మహబూబాబాద్‌, కేసముద్రం మున్సిపాలిటీలోని ఆశావహులు స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్‌, ఎంపీ బలరాంనాయక్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు భరత్‌ చందర్‌ రెడ్డి వద్దకు వెళ్లి తమకు అవకాశం కల్పించేలా చూడాలని కోరుతున్నారు. అదే విధంగా మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీలకు చెందిన ఆశావహులు ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌తోపాటు మాజీ ఎంపీ సురేందర్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ద్వారా పేర్లు చెప్పించుకొని బెర్త్‌ ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, పీసీసీ నాయకురాలు ఝాన్సీరెడ్డి వద్దకు వెళ్లి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిసింది.

ఐదు మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపికకు కసరత్తు

రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు

మానుకోటలో ఒక సభ్యుడికోసం

సీపీఎం ప్రయత్నం

ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ప్రయత్నాలు

మానుకోటలో మిత్రులకు ఒకటి

ఎన్నికల ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మహబూబాబాద్‌ మున్సిపాలిటీలోని కోఆప్షన్‌ సభ్యుల ఎంపికలో తమ పార్టీకి ఒకరికి అవకాశం ఇవ్వాలని సీపీఎం నాయకులు కోరుతున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ నాయకులు కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. మైనార్టీ విభాగానికి చెందిన వారా.. సామాజిక సేవా కార్యకర్తల, మాజీ ప్రజా ప్రతినిధి కోటానా అనే ది తేలాల్సి ఉంది. ఇందుకోసం ఎవరిని ఎంపిక చేయాలనే చర్చ పార్టీలో మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement