కలెక్టర్‌ మేడం ఆగయా.. | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ మేడం ఆగయా..

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

కలెక్టర్‌ మేడం ఆగయా..

కలెక్టర్‌ మేడం ఆగయా..

జిల్లా పాలనాధికారిగా స్నేహశబరీష్‌

సాక్షి, మహబూబాబాద్‌ : జిల్లాలో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయన అనుకున్నట్టుగానే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు బదిలీ కాగా.. హనుమకొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న స్నేహ శబరీష్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు. బదిలీ కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థి తుల్లో కొత్త కలెక్టర్‌ జిల్లాను చక్కదిద్దడం.. అధి కారుల మధ్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు వచ్చీరాగానే పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

రెండేళ్లుగా..

గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శశాంక బదిలీ కావడంతో ఆయన స్థానంలో వచ్చిన అద్వైత్‌కుమార్‌ సింగ్‌ ప్రత్యేక తరహాలో వ్యవహరించారనే ప్రచారం ఉంది. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లాలో ఏ పని చేయాలన్నా.. జీఓ ఉందా అని ప్రశ్నిస్తూ ముందుకు సాగారు. దీంతో రెండేళ్లుగా వందల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రత్యేంగా విద్య, వైద్యం, భూ సమస్యలు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాల వంటి ఫైల్స్‌ను పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు సంవత్సరాల తరబడి కలెక్టర్‌ పేషీలో పనిచేస్తున్న అధికారులు చెప్పిందే వేదంగా వ్యవహరించారని, దీనిని అడ్డంగా పెట్టుకొని కొందరు అధికారులు తమకు నచ్చిన వారి ఫైల్స్‌ పంపించడం, మిగిలిన వారివి పెండింగ్‌లో పెట్టడం పరిపాటిగా మారిందనే ప్రచారం. మరికొందరు అధికారులు అయితే షాడో కలెక్టర్‌గా వ్యవహరించడం, కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులను బెదిరించడం, ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు తిట్టడం.. మానసిక వేదనకు గురి చేసిన సంఘటనలు ఉన్నట్లు కలెక్టరేట్‌ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలెక్టర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.

కొత్త కలెక్టర్‌పైనే భారం..

జిల్లాకు కొత్తగా బదిలీపై వచ్చిన కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ నూతన పనులు చేపట్టడం ఒక భాగమైతే పెండింగ్‌ ఫైల్స్‌ను పూర్తి చేయడం మరింత భారంగా మారనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా ఉన్న నారాయణపురం రైతుల భూ వివాదం కొత్త కలెక్టర్‌ పరిష్కారం చూపుతారనే ఆశలు చిగురించాయి. దీనికితోడు గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థాయిలో నిలిచింది. ప్రస్తుతం కూడా మొదటి స్థానంలో నిలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కలెక్టర్‌ సమావేశం అనగానే బెంబేలెత్తే అధికారులకు భరోసా కల్పించాలి. సుదీర్ఘ కాలం కలెక్టరేట్‌ను అంటిపెట్టుకొని పనిచేస్తూ.. కింది స్థాయి ఉద్యోగులపై పెత్తనం చెలాయించే వారి నిజ స్వరూపం తెలుసుకోవాల్సి ఉంది. దీనికి తోడు అస్తవ్యస్తంగా ఉన్న విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్‌ శాఖల పనితీరును చక్కదిద్దుతూనే.. ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కొత్త కలెక్టర్‌పై ఉంది.

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ ఢిల్లీకి బదిలీ

వివాదాలు, ఆరోపణలతో ముగిసిన ప్రస్థానం

పెండింగ్‌ ఫైల్స్‌, అస్తవ్యస్త పాలన

నూతన కలెక్టర్‌కు సవాల్‌గా

పదో తరగతి పరీక్షలు

స్నేహ శబరీష్‌ గురించి..

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

పూర్తి పేరు: పి.స్నేహ శబరీష్‌

కేడర్‌, బ్యాచ్‌ : ఐఏఎస్‌, 2017 బ్యాచ్‌ (తెలంగాణ కేడర్‌)

స్వస్థలం: కేరళ రాష్ట్రం

కుటుంబం: ఆమె భర్త డాక్టర్‌ శబరీష్‌, ఐపీఎస్‌ (2017 బ్యాచ్‌). ఆయన ప్రస్తుతం మహబూబాబాద్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.

విద్యార్హతలు: ప్రాథమిక, ఉన్నత విద్య కేరళలో పూర్తిచేశారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో (యూపీఎస్సీ 2016) జాతీయస్థాయిలో 47వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. కామారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా పనిచేశారు. జీహెచ్‌ఎంసీలో జాయింట్‌ కమిషనర్‌గా, జోనల్‌ కమిషనర్‌గా సేవలందించారు. 2025 జూన్‌ 12న హనుమకొండ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి పనులు, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. గురువారం జరిగిన బదిలీల్లో మహబూబాబాద్‌ కలెక్టర్‌గా నియమితులు కాగా.. ఒకే జిల్లాలో భార్యాభర్తలు కలెక్టర్‌, ఎస్పీగా పనిచేసే అరుదైన అవకాశం కలిగింది.

బాధ్యతల స్వీకరణ..

మహబూబాబాద్‌: కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్ట రేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌కు అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌టొప్పో, అనిల్‌కుమార్‌, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్‌, జిల్లా అధికారులు పూల మొక్కలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement