వెల్దుర్తి: గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారు సువర్ణ కిరీటాలంకరణలో ధగధగ మెరిసిపోయారు. దాతలు అమ్మవారికి అపురూప కానుక సమర్పించడంతో స్వర్ణ కాంతిలో జగజ్జనని విరాజిల్లారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన ప్రముఖ బ్రాహ్మణ కుటుంబం అన్నదానం వాసుదేవయ్య కుటుంబీకులు దాతలుగా మూడు రోజులుగా శాస్త్రోక్తంగా యాగాలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారికి కేజీ బరువైన రూ.కోటిన్నరపై విలువ కలిగిన బంగారు కిరీటాన్ని ఆదివారం భక్తి శ్రద్ధలతో బహూకరించారు. అర్చకుల సమక్షంలో దాతలు తమ స్వహస్తాలతో అమ్మవారికి అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వంశస్తులు బొమ్మన దశరథ రామిరెడ్డి, పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త తిరివీధి సాయిప్రసాద్ పాల్గొన్నారు.


