నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు మొదలు అదే దాడులు.. అదే దౌర్జన్యం. చివరకు ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు కూడా వినియోగించుకోలేని పరిస్థితిని తెచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి పచ్చమూకలను తీసుకొచ్చి యథేచ్ఛగా బోగస్ ఓట్లు వేయించినా అధికారులు చూస్తూ ఉండిపోయారు. పోలింగ్ కేంద్రాలను చుట్టుముట్టి హల్‌చల్ చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. పోలింగ్ కేంద్రాలను అడ్డాగా చేసుకుని దొంగ ఓట్లతో రీ సైక్లింగ్‌కు పాల్పడ్డాయి. ఎన్నికల అధికారులు, పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వీరి ఆగడాలు చూసి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు వచ్చేందుకు భయపడ్డారు.
బేతంచెర్ల: టీడీపీ నాయకుల అరాచకానికి బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. పోలింగ్ ఉదయం 10 గంటల వరకు ప్రశాంతంగా సాగుతుండగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయని భావించిన టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఏకంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శేషారెడ్డి ఉన్నత పాఠశాల, సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాల, ప్రాథమిక మెయిన్ పాఠశాల, సంజీవనగర్, హనుమాన్‌నగర్ కాలనీల్లో పోలింగ్ కేంద్రాలకు టీడీపీ నాయకులు గుంపులుగా వెళ్లి తిష్ట వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వందలాది మందిని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేశారు.
మండల టీడీపీ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, షేక్షావలి చౌదరి, ఉన్నం ఎల్లనాగయ్య, చంద్రశేఖర్ సైతం పలువురు చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇతర ఓటర్లను తరలించారు.
శేషారెడ్డి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారం రావడంతో మాజీ ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, ఉర్దూ అకాడమీ మాజీ డైరక్టర్ మూర్తుజావలీ, నాయకులు నాగేశ్వరరావు, బుగ్గన కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు టీడీపీ నాయకులు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించాలని కోరడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపైన లాఠీ ఝుళిపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద లేకుండా తరిమివేశారు.
బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తే ఒప్పుకునేది లేదని 2 గంటల సమయంలో 3వ వార్డు కౌన్సిలర్ చింతల నాగిరెడ్డి పట్టుబట్టారు. ఒక క్రమంలో ఆయనపైకి టీడీపీ నాయకులు దాడికి యత్నించా రు. బయటి ఓటర్లను అనుమతించనని పోలింగ్ కేంద్రం ముందు కూర్చున్నాడు. అతడిని 3 గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లిన తర్వాత దొంగ ఓట్లు వేసుకున్నారు.
28వ వార్డులో పచ్చమూకలు భారీగా రీసైక్లింగ్ పాల్పడినట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వందాలాది మందిని తీసుకొచ్చి షెల్టర్ కల్పించారు. బూత్‌లను ఆక్రమించుకొని ఓటర్ల స్థానంలో పచ్చమూకలను పంపించి సాయంత్రం 5 గంటల వరకు రీ సైక్లింగ్‌కు పాల్పడ్డారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని ప్రకటనలకే పరిమితమైనా అన్ని చోట్ల టీడీపీ నాయకులు పదుల సంఖ్యలో మోహరించడంతో సామాన్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.
కీలక నేతలు అరెస్టు
పోలింగ్‌కు ముందే నగర పంచాయతీ మాజీ చైర్మన్ చలం రెడ్డి, మాజీ ఎంపీటీసీ మునేశ్వర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మర్రికుంట మురళీధర్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. మిగిలిన ద్వితీయ శ్రేణి నాయకులపై పోలీసుల అండతో పచ్చమూకలు దాడులు, దౌర్జన్యాలకు దిగారు.
బేతంచెర్లలో టీడీపీ నాయకుల
చేతుల్లోకి వెళ్లిన పోలింగ్ కేంద్రాలు
వైఎస్సార్‌సీపీకి అనూకూలంగా
ఉండటంతో దొంగ ఓట్లతో రీసైక్లింగ్
ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని
తరలించి ఓట్లేయించిన టీడీపీ నేతలు
ఎన్నికల అధికారులు, పోలీసుల
సమక్షంలోనే భారీగా బోగస్ ఓట్లు
టీడీపీ నాయకుల దౌర్జన్యానికి
భయపడి ఓటింగ్‌కు రాని
సామాన్య ఓటర్లు


