● బెదిరించడమే టీడీపీ రాజకీయమా?
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
దేవనకొండ: మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో.. రౌడీ రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా బెదిరించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేవనకొండ, పి.కోటకొండ గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీపీ , జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యంలో రౌడీరాజ్యంగా మారిందన్నారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేయించి జైలుకు పంపారన్నారు. తాను ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కోసం తాను ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లడం సిద్ధంగా ఉన్నానన్నారు. తనను 70 రోజులు జైలులో పెట్టిన ఘనత టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతికే చెల్లిందన్నారు.
కరువుతోనూ రాజకీయమా?
ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో వైఎస్సార్సీపీకి మంచి పట్టు ఉందని ఎమ్మెల్యే అన్నారు. దీని దృష్టిలో ఉంచుకుని దేవనకొండ మండలాన్ని కరువు జాబితా నుంచి తప్పించారన్కానరు. టీడీపీ ఆలూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న వారు కరువుతోనూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దేవనకొండ మండలంలో లక్షల ఎకరాల్లో పంటలు వేసినా రైతులకు విత్తన ఖర్చులు కూడా రాలేదన్నారు. రైతుల ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి వేదావతి, ఎంపీపీ అభ్యర్థి దివాకర్‌నాయుడు, మండల కన్వీనర్ రామకృష్ణ, లీగల్ సెల్ అడ్వైజర్ కబీర్‌దాస్, మాజీ సహకార సంఘం చైర్మన్ లక్ష్మీదేవి, చైర్మన్ కొత్త కాపు మధుసూదన్‌రెడ్డి, రాజారెడ్డి, మోహన్‌రెడ్డి, అరుణ్‌కుమార్, లుమాంబ, వీరేష్, హర్షవర్ధన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, మండలంలోని కార్యకర్తలు పాల్గొన్నారు.


