● వాట్సాప్ గ్రూపులో టీడీపీ అభ్యర్థికి
ఓటు వేయాలని సందేశం
కర్నూలు(సెంట్రల్)/కల్లూరు:మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార గడువు ముగిసినా కల్లూ రు మండల విద్యాశాఖాధికారి ముద్దనూరు శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న ఆయన 300 మందికి పైగా ప్రభుత్వ అధికారులు సభ్యులు ఉన్న వాట్సాప్ గ్రూపులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ అభ్యర్థికి తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సందేశం ఇచ్చారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎంఈఓ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నా ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసినట్లు వస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడతారా? ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఉండే వాట్సాప్ గ్రూపులో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని పోస్టర్‌ను పోస్టు చేసిన ఎంఈఓ శ్రీనివాసులు


