కర్నూలు(అర్బన్): ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్ పేపర్లను మండలాలకు చేరవేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లా పరిషత్ సీఈఓలు ఆర్ సుధాకర్‌రెడ్డి, శివశంకర్, ఏఆర్‌ఓ అశ్వినీకుమార్, జెడ్పీ పరిపాలనాధికారి మురళీమోహన్‌రెడ్డి పర్యవేక్షణలో స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో ముద్రిస్తున్న బ్యాలెట్ పేపర్లను ఆదివారం ఉదయం నుంచి ఆయా మండలాలకు పంపించే కార్యక్రమంలో జిల్లా పరిషత్ పరిపాలనాధికారులు, ఉద్యోగులు నిమగ్నం అయ్యారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓ, ఏఓలను ఇక్కడకు పిలిపించి వారి ఆధ్వర్యంలో బ్యాలెట్ పేపర్లను పంపుతున్నారు. కాగా, కర్నూలు జిల్లాలో ఎన్నికలు జరిగే అన్ని మండలాలకు రాత్రిలోగా పంపించేందుకు, నంద్యాల జిల్లాకు ఈ నెల 2వ తేది సాయంత్రంలోగా చేరేలా కార్యచరణను రూపొందించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలకు గాను 74 స్థానాలు ఏకగ్రీవం కాగా, 358 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నంద్యాల జిల్లాలో మొత్తం 377 ఎంపీటీసీ స్థానాలకు గాను 152 స్థానాలు ఏకగ్రీవం కాగా,మిగిలిన 225 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే బనగానపల్లె మండలంలోని క్రిష్ణగిరి ఎంపీటీసీ స్థానానికి దాఖాలైన నామినేషన్లన్ని తిరస్కరణకు గురి కావడంతో అక్కడ ఎన్నిక నిలిచి పోయింది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లాలో 224 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో 26 జెడ్పీటీసీ, నంద్యాల జిల్లాలో 28 జెడ్పీటీసీలకు గాను 8 స్థానాలు ఏకగ్రీవం కాగా, 20 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


