● కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
నంద్యాల(న్యూటౌన్): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ స్ట్రాంగ్ రూం కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 73 పోలింగ్ లోకేషన్లు ఉండగా వాటికి అనుగుణంగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1.99 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో పటిష్టమైన త్రిలేయర్ కార్డెన్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలన్నారు. లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.


