వైఎస్సార్‌సీపీ గ్రామాల్లో టీడీపీ రౌడీయిజం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గ్రామాల్లో టీడీపీ రౌడీయిజం

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

ఇళ్లపై రాళ్లు రువ్విన వైనం

రెచ్చగొట్ట్టే విధంగా వ్యాఖ్యలు

టీడీపీ ఇన్‌చార్జ్‌ రాఘవేంద్రరెడ్డి ప్రచారంలో వికృత చేష్టలు

సంయమనం పాటించిన ప్రజలు

మంత్రాలయం: వైఎస్సార్‌సీపీ గ్రామాలు.. ఇటీవల ఎంపీటీసీ స్థానాలను కై వసం చేసుకున్న ప్రాంతాలు.. అలాంటి ప్రశాంత పల్లెల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌ ఎన్‌.రాఘవేంద్రరెడ్డి జెడ్పీటీసీ ఎన్నిక ప్రచారానికి దిగారు. ఇదే అదనుగా చూసుకున్న టీడీపీ నాయకులు రౌడీయిజం చేశారు. పోలీసుల ఎదుటే కోడ్‌ను కాలదన్ని పచ్చజెండాలతో నానా యాగీ చేశారు. ఊళ్లు అదిరేలా ఈలలు వేశారు.. మీసాలు దువ్వారు.. తాళాలు వేసిన ఇళ్ల పైకి రాళ్లు రువ్వారు.. ఇళ్లకు పచ్చజెండాలు కట్టేందుకు ఎగబడ్డారు. జెండా కట్టొద్దని బతిమలాడినా బలవంతాలకు దిగారు. వెర్రి చేష్టలతో పోలీసులకు సైతం వణుకు పుట్టించేలా విర్రవీగారు. ఓ దశలో దిబ్బనదొడ్డి గ్రామస్తుడిపై చెయ్యి చేసుకునేందుకు విరుచుకుపడ్డారు. వివరాలివి.. స్థానిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం టీడీపీ ఇన్‌చార్జ్‌ రాఘవేంద్రరెడ్డి మండలంలోని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి స్వగ్రామం రాంపురం, ఎమ్మెల్యేను ఆరాధించే దిబ్బనదొడ్డి, 52–బసాపురంలో ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, ఎల్లెల్సీ బోర్డు మెంబర్‌ టిప్పుసుల్తాన్‌తో కలిసి ముందుగా రాంపురం బయలు దేరారు. గత సంఘటన రీత్యా ఏఎస్పీ మోహన్‌కృష్ణ, డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు నడుమ ప్రచారానికి వచ్చారు. అయితే కోడ్‌ అమలులో ఉన్నా 25 వాహనాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గుంపుతో అక్కడికి చేరుకున్నారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఆయన ప్రచార రూట్‌ను రాంపురంలోని గ్రామ చావిడి ప్రాంతానికి మార్చారు. అయితే అక్కడి వస్తున్న తరుణంలో టీడీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసుకుంటుండగానే బిగ్గరగా ఈలలు వేసి రచ్చ చేశారు. రాఘవేంద్రరెడ్డి వారించినాగానీ కేకలు, ఈలలు మానలేదు. పూజానంతరం ప్రసంగం కానిచ్చి అక్కడి నుంచి దిబ్బనదొడ్డికి చేరుకున్నారు. అయితే టీడీపీ నేతల ప్రచారం ఇష్టం లేని గ్రామస్తులు ఇండ్లకు తాళాలు వేసి కొందరు పనులకు వెళ్లగా మరికొందరు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు గ్రామ వీధుల్లో ఈలలు వేసుకుంటూ ఇళ్లకు టీడీపీ జెండాలు కట్టేందుకు పూనుకున్నారు. ఇష్టంలేని ఉసేని అనే గ్రామస్తుడు తమ ఇంటికి జెండా కట్టకండి అంటూ అడ్డుజెప్పబోయాడు. దీంతో టీడీపీ గుంపు ఆయనపై చెయ్యి చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రసంగం కానిచ్చుకుని వెనుదిరుగుతుండగా కొందరు యువకులు ఇండ్లపై నుంచి చూస్తుండగా టీడీపీ మూకలు ఈలలు వేస్తూ రెచ్చగొట్టే యత్నం చేశారు. అంతేగాక ఇండ్లపైకి రాళ్లు సైతం రువ్వారు. గ్రామంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం సృష్టించారు. ఇండ్లపై రాళ్లు రువ్వినా.. రెచ్చగొట్టేందుకు యత్నించినా దిబ్బనదొడ్డి వాసులు మాత్రం సహనం పాటించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆజ్ఞ మేరకు జవ దాటకుండా శభాష్‌ అనిపించుకున్నారు.

ప్రచారానికి బ్రేక్‌ ..

టీడీపీ గుంపు చేష్టలతో రాంపురం, దిబ్బనదొడ్డి గ్రామాల ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. ఇండ్లపై రాళ్లు రువ్విన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సైతం నిలదీసేందుకు రాంపురం నుంచి 52–బసాపురానికి బయలు దేరారు. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు టీడీపీ నాయకుల ప్రచారానికి బ్రేక్‌ వేశారు. బసాపురంలో ప్రచారం చేయకుండా టీడీపీ నేతలను అక్కడి నుంచి సాగనంపారు. రాఘవేంద్రరెడ్డి తన అనుచరగణంతో అక్కడి నుంచి స్వగ్రామం మాధవరం చేరుకున్నారు. ఇలా రెచ్చగొట్టే ప్రచారాలపై ఆయా గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. సహనానికి పరీక్ష పెట్టకండంటూ వాపోయారు. ప్రశాంతంగా ప్రచారం చేసుకుని వెళ్లకుండా ఇలా ఇళ్లపై రాళ్లు వేయడంపై నిట్టూర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement