● 10 తులాల కాసులదండ, నాగుకన్నులు, మీసాలు ఎత్తుకెళ్లిన దుండగలు
హాలహర్వి: మండలంలోని మల్లికార్జునపల్లె గ్రామంలో సుంకమ్మ, మారెమ్మ దేవాలయాల్లో గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో అమ్మవార్ల విలువైన వెండి ఆభరణాలను అపహరించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. రోజూ మాదిరిగానే పూజారి మారయ్య ఉదయం పూజల నిమిత్తం ఆలయానికి చేరుకోగా, గర్భగుడి తలుపులు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా, అమ్మవార్లకు సంబంధించిన కిరీటం, నాలుగు తాళిబొట్లు, 10 తులాల వెండి కాసుల దండతో పాటు నాగు కన్నులు, మీసాలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే హాలహర్వి ఎస్‌ఐ ఈశ్వరరావుకు సమాచారం అందించగా, ఆయన క్లూస్ టీంను రప్పించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ.70 వేలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు.


