డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జూలై/ఆగస్టు నెలల్లో నిర్వహించిన డిగ్రీ రెండవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రీ వాల్యుయేషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి. వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. 1,246 మంది విద్యార్థులు 1,782 పేపర్లకు దరఖాస్తు చూసుకోగా 409 మందికి సంబంధించి 436 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

పీజీ రెండో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు నెలలో నిర్వహించిన పీజీ రెండవ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విడుదలయ్యాయి. రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు 414 మంది విద్యార్థులకు 375 మంది, సప్లిటమెంటరీ పరీక్షలకు సంబంధించి 52 మందిలో 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

క్వింటా ఉల్లి రూ.4,759

కర్నూలు(అగ్రికల్చర్‌): వినియోగదారులను ఉల్లి ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు రాయితీపై ఉల్లిగడ్డలు పంపిణీ చేసింది. నేడు ఉల్లి ధరలు పెరిగి వినియోగదారులు అల్లాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం గమనార్హం. రీటైల్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర ఉల్లి కిలో రూ.60పైగా ధర పలుకుతోంది. లోకల్‌ ఉల్లిగడ్డలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో కిలో రూ.32 ప్రకారం చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. తాజాగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి ధర మరింత పెరిగింది. మార్కెట్‌కు 4,829 క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చింది. కనిష్ట ధర రూ.982, గరిష్ట ధర రూ.4,759 లభించగా.. సగటు ధర రూ.3,889 నమోదైంది. కాగా మార్కెట్‌లో వేరుశనగ, మిర్చి, సజ్జల ధరలు తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి

కర్నూలు (అర్బన్‌): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని నోడల్‌ అధికారి, డ్వామా పీడీ నరసింహారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులకు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి, ఎంసీసీ నోడల్‌ అధికారి టీవీ భాస్కర్‌నాయుడు, ఏఆర్‌ఓ అశ్వినీకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు విధానం, బ్యాలెట్‌ పేపర్ల వర్గీకరణ, బండిలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల నిర్వహణ, ఫలితాల నమోదు తదితర అంశాలతో పాటు ఎన్నికల నిర్వహణ సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును నిర్దేశిత విధానంలో రౌండ్ల వారీగా నిర్వహించి, ప్రతి రౌండ్‌కు సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. చెల్లని ఓట్ల విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలను అనుసరించాలన్నారు.

వైభవంగా పవిత్రోత్సవం

ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం వేకువజామునే మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. రాత్రి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement