కెమెరా ప్రత్యేకతలు
● 2 మెగా పిక్సెల్ రెజల్యూషన్
● 120 డిగ్రీల కోణంలో వీడియో చిత్రీకరణ
● వీడియోలు, ఫొటోలు చిత్రీకరణతో పాటు వాయిస్ రికార్డింగ్ సౌకర్యం
● 32 జీబీ అంతర్గత మెమోరీ
● మెమోరీ కార్డు లేకుండా 48 గంటలు ఏకబిగిన రికార్డింగ్ చేసే సౌకర్యం
● కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నియంత్రణ చేసే అవకాశం
కర్నూలు: ఈ కెమెరాకు ఒళ్లంతా కళ్లే. ఏ తప్పు చేసినా దొరికిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీనికి చిక్కితే కష్టాలే. పోలీసులు వినియోగిస్తున్న బాడీ వార్న్ (బీడబ్ల్యూఎస్) వీడియో పరికరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పరికరాన్ని జిల్లాలో ఇంతకుముందు నుంచే వాడినా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంకా విస్తృతంగా వినియోగించనున్నారు. అరచేతిలో ఇమిడిపోయే దీనిని పోలీసులు భుజం, ఛాతి, తలభాగంలో అమర్చుకుని విధులు నిర్వహిస్తారు. ఏకకాలంలో వీడియో, ఫొటో చిత్రీకరణతో పాటు శబ్ధాలను నమోదు చేస్తుంది. గతంలో తుంగభద్ర పుష్కరాలు, పంచాయతీ ఎన్నికల్లో వీటి వినియోగం సత్ఫలితాలు ఇవ్వడంతో పుర పోరులోనూ వినియోగించనున్నారు. జిల్లాలో 78 పరికరాలు అందుబాటులో ఉన్నాయి. డీఎస్పీ, సీఐల పర్యవేక్షణలో పనిచేసే బృందాలు వీటిని వినియోగించి రౌడీ, అల్లరిమూకల ఆట కట్టించనున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో వీటితో నిఘా వేయనున్నారు. వీటి వాడకంపై పోలీసులకు పలు దఫాలుగా శిక్షణ కూడా ఇచ్చారు.
కమాండ్ కంట్రోల్ రూమ్‌కు
అనుసంధానం
జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడంతో పాటు ఎక్కడ ఏమి జరుగుతుందో ఉన్నతాధికారుల పర్యవేక్షణకు సులువుగా ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీతో పాటు గూడూరు మండల పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు విధులకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బంది బాడీ వార్న్ కెమెరాలను వినియోగించనున్నారు. వీటితో అల్లర్లు, తోపులాటలు, గొడవలు వంటివి చోటు చేసుకునే పరిస్థితిని బట్టి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
పాత నేరస్తులు తారసపడితే
అప్రమత్తం చేస్తుంది
ఈ పరికరానికి ఉన్న మరో ప్రత్యేకత ముఖాన్ని గుర్తించడం (ఫేస్ రికగ్నైజేషన్). జిల్లాలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల ఫొటోలు స్కాన్ చేసి ఇందులో పొందుపరిస్తే చాలు ఆ వ్యక్తి ఎక్కడ తారసపడినా ఈ పరికరం పోలీసులను అప్రమత్తం చేస్తుంది.
పుర పోరుకు బాడీ వార్న్ కెమెరాలతో
పోలీసు నిఘా
అందుబాటులో 78 పరికరాలు
సమస్యాత్మక, రద్దీ ప్రాంతాల్లో వినియోగం


