కర్నూలు(సెంట్రల్): జిల్లాలో లింగ నిర్ధారణ చేసే ఆసుపత్రులు, ల్యాబ్‌లను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వైద్య, ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం అమలుపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా స్థాయి సలహా కమిటీ 2 కొత్త స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లకు, 8 స్కానింగ్ కేంద్రాలు రెన్యువల్‌కు, ఏడు మోడిఫికేషన్ కోసం చేసుకున్న దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మిరాజ్యం, డిఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


