కర్నూలు(అగ్రికల్చర్): వీబీ జీ రామ్ జీ కింద ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీబీ జీ రామ్ జీపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి అడిషనల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఉపాధి పనులకు హాజరైన శ్రామికుల వివరాలను సిద్ధం చేయాలన్నారు. ప్రతి మండలంలో అతి తక్కువ లేబర్ రిపోర్టు ఉన్న మూడు గ్రామ పంచాయతీలను గుర్తించాలన్నారు. పశువుల షెడ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణంలో పురోగతి కనపర్చాలన్నారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఏపీడీలు పద్మావతి, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.


