టీబీ డ్యాం నుంచి నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాం నుంచి నీటి విడుదల

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

కర్నూలు సిటీ/హాలహర్వి: తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో నది తీర గ్రామాల్లో, తుంగభద్ర జలాలపై ఆధారపడిన తాగు నీటి పథకాలకు నీరు అందించేందుకు టీబీ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేశారు. టీబీ డ్యాంలో ఈ ఏడాది నీటి లభ్యత ప్రకారం 2026–27 నీటి సంవత్సరంలో 5.094 టీఎంసీలు కేటాయించారు. ఇందులో 1 టీఎంసీ నీటిని ఆరు రోజుల పాటు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని ఇటీవలే జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ శైలేశ్వర్‌ రెడ్డి టీబీ బోర్డుకు ఇండెంట్‌ పెట్టారు. ఈ మేరకు డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నది తడారిపోయింది.

బ్రిడ్జి నిర్మాణానికి మోక్షమెప్పుడో?

వేదావతి నదిపై శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. వర్షాకాలంలో నది పొంగిన ప్రతిసారి రాకపోకలు నిలిచిపోతుండటంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, అత్యవ సర వైద్య సేవలు పొందాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయినా, బ్రిడ్జి నిర్మాణంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిలు ప్రత్యేక దృష్టి సారించడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం వేదావతి నదిపై శాశ్వత బ్రిడ్జి నిర్మించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ఉప్పొంగిన వేదావతి నది

ఎగువ రాష్ట్రం కర్ణాటక, అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలతో హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న వంతెనపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేదావతి నదిలో ప్రవహిస్తున్న వరద నీరు తుంగభద్ర నదిలో కలువనుండటంతో తీర గ్రామాల్లో తాగు నీటి అవసరాలు తీరనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement