● వీఆర్‌పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాల్మీకులను పూర్తిగా విస్మరించిందని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, వైఎస్సార్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో పలుమార్లు హామీలు ఇచ్చారని, గడచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2017 డిసెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆధ్వర్యంలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. అయితే నేటికీ వాల్మీకులకు ఎస్టీ హోదా లభించలేదని, ఇప్పటికై నా చంద్రబాబు, కూటమి పార్టీ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి చట్టబద్ధం చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందన్నారు. వాల్మీకుల ఎస్టీ హోదా సాధన కోసం పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
వాల్మీకి జయంతిని
ఘనంగా జరుపుకుందాం ...
ఈ నెల 26వ తేదీ మహర్షి వాల్మీకి జయంతి వేడు కలను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుందామని సుభాష్ పిలుపునిచ్చారు. వాల్మీకి మహర్షి కుల మతాలకు అతీతంగా ఆరాధ్యనీయుడని, ఆయన జయంతిని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు.


