కొలిమిగుండ్ల: దసరా సెలవులు ముగియడంతో ఆర్టీసీ బస్సులు రద్దీగా తిరుగుతున్నాయి. కొలిమిగుండ్లలో ఉదయం నుంచే వివిధ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. తాడిపత్రి నుంచి బనగానపల్లె వైపు వెళ్లాల్సిన బస్సులు ఆర్టీసీ బస్టాండ్‌లోకి రాకుండా ప్రధాన రహదారిపైనే నిలుపుతున్న కారణంగా ప్రయాణికులు అక్కడే ఎదురు చూడాల్సి వస్తుంది. తాడిపత్రి నుంచే బస్సులు రద్దీగా రావడంతో కొలిమిగుండ్లలో కొంత మందిని మాత్రమే ఎక్కించుకొని వెళ్లారు. ఇతర డిపోలకు చెందిన ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నిలపకుండానే వెళ్లారు. దీంతో విద్యార్థులతో పాటు మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.


