మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావన దర్శనానికి రెండు గంటలపాటు సమయం పట్టింది. భక్తుల రద్దీతో గ్రామ దేవత మంచాలమ్మ దర్శన, పరిమళ ప్రసాదం, అన్నపూర్ణభోజనశాల క్యూలైన్లు కిక్కిరిశాయి. అదే విధంగా పూర్ణమి సందర్భంగా యజ్ఞమండపంలో మూల బృందావన ప్రతిమకు, పాదుకలకు దివాన్ ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. శ్రీమఠం ప్రాంగణం చుట్టూ భక్తుల మధ్య ఊరేగించారు. శ్రీమఠంలో శ్రీసత్యానారాయణ వ్రతం చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.
ఎన్నికల శిక్షణకు 198 మంది అధికారుల గైర్హాజరు
కర్నూలు(అర్బన్): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆదివారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ ఎన్నికలకు సంబంధించి పీఓలుగా 1,760, ఏపీఓలుగా 1,766 మంది అధికారులను నియమించారు. అయితే వీరికి ఆయా మండల కేంద్రాల్లో ఇచ్చిన శిక్షణకు పీఓలు 134, ఏపీఓలు 64 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరు అయిన 198 మందిపై జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం చర్యలు తీసుకోనుంది.
ఎన్నికలు ముగిసే వరకు పీజీఆర్‌ఎస్ రద్దు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో స్థానిక సంస్థల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికలు ముగిసేవరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి వ్యయ ప్రయాసలకోర్చి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. అలాగే మండల, డివిజన్ స్థాయిల్లో కూడా జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమలను రద్దు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో
తేలికపాటి వర్షాలే
● ప్రభావం చూపని అల్పపీడనం
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాపై అతి తక్కువగా ఉంది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. రబీ సాగుకు అక్టోబరు నెల అత్యంత కీలకం. ఈ నెలల్లో విత్తనం పడితేనే శనగ, జొన్న, మొక్కజొన్న, టమాటలో రాణించే అవకాశం ఉంది. అక్టోబరు నెలలో 22 వరకు చినుకు జాడలేదు. 23వ తేదీ మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తాజాగా 17 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. క్రిష్ణగిరిలో 23.8 మి.మీ., చిప్పగిరిలో 22.2, మద్దికెరలో 13.6, ఓర్వకల్‌లో 5, వెల్దుర్తిలో 4.4, హలహర్విలో 4.2, తుగ్గలిలో 3.4, ఆలూరులో 3.2 మి.మీ. ప్రకారం జల్లులు పడ్డాయి. అక్టోబరు నెల సాధారణ వర్షపాతం 109.9 మి.మీ. ఉండగా..25 రోజుల్లో 18.5 మి.మీ. మాత్రమే నమోదైంది. అక్టోబరు నెలలో 83 శాతం లోటు వర్షపాతంతో రబీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రేమ వ్యవహారంలో యువకుడి ఆత్మహత్య
వెల్దుర్తి: ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్లెపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో వెల్డింగ్ షాప్ పెట్టుకుని జీవిస్తున్న గొల్ల భాష్యం జగదీష్(20)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న జగదీష్ తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన జగదీష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. తండ్రి మద్దిలేటి, కుటుంబ సభ్యులు రాత్రి ఇంటికి చేరుకోగా జగదీష్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో కుటుంబీకులు వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


