● ఇది చంద్రబాబు దిగజారుడుతనమే
● దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉంది
● వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా
అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు షర్మిల కుమార్తె వివాహ అంశాన్ని సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మాజీ మేయర్ బీవై రామయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరుపై మొట్టికాయలు వేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అంశాలను పక్కనపెట్టి అన్నా చెల్లెళ్లు అయిన వైఎస్ జగన్, షర్మిల కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి తేవడం తగదన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతిపక్షం లేవనెత్తుతున్న అభ్యంతరాలు, నామినేషన్ల దాఖలును అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా అడ్డుకోవడం, అభ్యర్థుల ఉపసంహరణలపై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పకుండా, కుటుంబ వ్యవహారాలను చర్చలోకి తేవడంపై కుట్ర దాగి ఉందన్నారు. ఇది చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. కుటుంబంలోని వ్యవహారాలను ఆ కుటుంబ సభ్యులే పరిష్కరించుకుంటారని, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాటిని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చుకోవడం నీచ రాజకీయమని మండిపడ్డారు.
నామినేషన్ల సంఖ్యలో ఇంత తేడానా?
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సంఖ్యలో భారీ తేడాలపై అనుమానాలు కలుగుతున్నాయని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 409 నామినేషన్లు దాఖలయ్యాయని, రెండో రోజుకు ఆ సంఖ్య 2,409కు, మూడో రోజుకు 3,300కు చేరడం, మొత్తం 57,626 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని తెలిపారు.
ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య మాట్లాడుతూ.. బ్యాలెట్ పత్రాలతో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ బండారం బట్టబయలవుతుందనే భయం సీఎం చంద్రబాబులో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బిహార్, పశ్చిమబెంగాల్‌ను మరిపించే విధంగా అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా ప్రజాస్వామ్యబద్దంగా గెలవాలని, అక్రమాలు, దాడులతో కాదని చెప్పారు. సజావుగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయమని స్పష్టం చేశారు.


