● ఆదోని మాజీ ఎమ్మెల్యే
వై. సాయిప్రసాద్ రెడ్డి
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణ అభివృద్ధికి నిరోధకంగా ఉన్న వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి ప్రణీత రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థి గోవిందరాజులను గెలిపించాలని ఆదివారం పట్టణంలోని భాస్కర్ రెడ్డి కాలనీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్య సేవలను అందించాలని ఆదోనికి మెడికల్ కళాశాలను తీసుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను నిలిపి వేసిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి కాలనీలో రూ. 3.39 కోట్ల, భీమరెడ్డి కాలనీలో రూ. 70 లక్షలు, వైఎస్సార్ కాలనీలో రూ. 16 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమం విస్మరించి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. మహిళలపై టీడీపీ నేతలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. నిరుద్యోగభృతి, ఆడబిడ్డ పథకం, పింఛన్లు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే రాష్ట్రంలో అరాచక పాలన పోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తనయుడు మనోజ్ రెడ్డి, చైర్మన్ అభ్యర్థి భర్త సందీప్ రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవా తదితరులు పాల్గొన్నారు.


