కర్నూలు: కోర్టులలో పెండింగ్‌లోని చెక్కు బౌన్స్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు న్యాయమూర్తులకు సూచించారు. నవంబర్ 21న అన్ని కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులతో ఆయన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రధాన న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్‌లను ఏర్పాటు చేసి ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఇందుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా సహకారం అందిస్తే ఎక్కువ కేసుల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకుని రాజీపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.


