సమరం ముగిసె.. సంప్రదాయం వెల్లివెరిసె! | - | Sakshi
Sakshi News home page

సమరం ముగిసె.. సంప్రదాయం వెల్లివెరిసె!

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

● గొరవయ్యల ఢమురుకలతో హోరెత్తిన ‘దేవరగట్టు’ ● మూడు జఠికలకు ఇనుప గొలుసును తెంపిన గొరవయ్య గాదిలింగప్ప ● స్వామి సన్నిధానంలో ఆకట్టుకున్న దేవదాసీల క్రీడోత్సవం ● నేడు నెరణికి గ్రామానికి చేరనున్న ఉత్సవ విగ్రహాలు

● గొరవయ్యల ఢమురుకలతో హోరెత్తిన ‘దేవరగట్టు’ ● మూడు జఠికలకు ఇనుప గొలుసును తెంపిన గొరవయ్య గాదిలింగప్ప ● స్వామి సన్నిధానంలో ఆకట్టుకున్న దేవదాసీల క్రీడోత్సవం ● నేడు నెరణికి గ్రామానికి చేరనున్న ఉత్సవ విగ్రహాలు

హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్రలో ఆనవాయితీగా వస్తున్న గొరవయ్యల నృత్యాలు, గొలు సు తెంపుట, దేవదాసీల క్రీడలతో దేవరగట్టు మురిసిపోయింది. బన్ని ఉత్సవంలో కర్రల సమరం తర్వాత సంప్రదాయంగా ఇవి ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా వందలాదిగా తరలి వచ్చిన గొరవయ్యలు, పిల్ల గొరవయ్యల ఢమురుకల శబ్దాలు, పిల్లనగ్రోవిల నాదంతో దేవర ‘గట్టు’ హోరెత్తింది. జైత్రయాత్ర అనంతరం సింహాసన కట్టమీద కొలువుదీరిన మాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ముందు ఈ కార్యక్రమాలు కొనసాగాయి. స్థానికులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన గొరవయ్యలు స్వామి వారి ఉత్సవమూర్తుల ముందు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.గురు గొరవయ్యలు చాటిలతో కొట్టుకుంటూ ఉద్వేగంగా వచనాలు చెబుతూ పూనకంతో ఊగిపోయారు.

ఆకట్టుకున్న దేవదాిసీల క్రీడోత్సవం

అనంతరం జరిగిన దేవదాసిల క్రీడోత్సవం స్థానికల తో పాటు ఆదోని, ఆలూరు, గుంతకల్లు తదితర ప్రాంతాలనుంచి వచ్చిన బసివినిలతో సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నెరణికి గ్రామానికి చెందిన ఒక సామాజిక వర్గం ప్రజలు బసివినిలను ఎత్తుకు ని నృత్యాలు చేశారు. అనంతరం రంగు నీళ్లను భక్తులపై చల్లి వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్ర మాలను నిర్వహించారు. మాళమల్లేశ్వర విగ్రహాలతో పాటు పలకీని భక్తులు ఊరేగింపుతో కొండ పైనున్న ఆలయానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

నేడు నెరణికి చేరనున్న ఉత్సవ విగ్రహాలు..

దేవరగట్టులోని ఆలయంలో ఉన్న మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఆదివారం గొరవయ్యలు నెరణికి గ్రామానికి తరలిస్తారు. విగ్రహాలు గ్రామ ఊరు వాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి వద్ద కొలువుంచి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అర్ధరాత్రి వరకు ఊరేగింపు చేస్తారు. ఉత్సవ మూర్తులను ఉంచే ఇంటికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

మూడు జఠికలకు తెగిన గొలుసు

ఉత్సవంలో భాగంగా ఇనుప గొలుసును హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గొర వయ్య గాదిలింగప్ప మూడు జఠికలకు తెంపాడు. మల్లప్ప గుడి ముందు ప్రతి ఏటా ఇనుప గొలుసు తెంపడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా శనివారం దాదాపు 20 కేజీల బరువున్న ఇనుప గొలుసును మూడు జఠికలకు తెంపండంతో భక్తులు గొరవయ్యను భుజాల మీదెత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ఆనందంతో నృత్యాలు చేశారు. గతేడాది నాలుగు జఠికలకు గొలుసు తెగితే ఈ ఏడాది మూడు జఠికలకే తెగడం పట్ల భక్తులు సంతోషంతో ఎగిరి గంతులు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement