గోస్పాడు: జాతీయ అంధత్వ నివారణ ప్రోగ్రాంలో సివిల్ సర్జన్‌గా పనిచేసే డాక్టర్ నాగరాణి డీఎంహెచ్ఓ వేధింపులు తాళలేక శుక్రవారం కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ.. కార్యాలయంలో ఇద్దరు సివిల్ సర్జన్ డాక్టర్లు, ఇద్దరు పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ విధులు నిర్వహించాల్సి ఉండగా తానొక్కదాన్నే పనిచేస్తున్నట్లు చెప్పారు. విధులకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేస్తున్నా అవేవీ కావంటూ అవసరం ఉన్నా లేకపోయినా డీఎంహెచ్ఓ వద్దకు రావాలని ఆదేశిస్తున్నారని వాపోయారు. ఇటీవల ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించాలంటూ పిలిపించి మధ్యాహ్నం వరకు వేచిఉండేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా సెలవులు మంజూరు చేయకపోగా, జీతాల బిల్లులు కూడా సకాలంలో చేయకుండా నిలుపుదల చేస్తూ అవమానిస్తున్నారని వాపోయారు. ఈనెల 16 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు మెడికల్ లివ్ మంజూరు చేయాలని కోరినా సమాధానం ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. దీంతో విసుగు చెంది డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించానని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ రాత్రి సమయంలో డీడీఓ విధులు తొలగించి ఇంకో అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ డాక్టర్ శారదాబాయిని ‘సాక్షి’ వివరణ కోరగా అధికారి మెడికల్ లివ్‌లో వెళ్లిందని, ఇప్పుడు తమకు ఎలాంటి సమాచారం లేకుండా విధుల్లో ఉన్నారని, ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు.


