కర్నూలు(హాస్పిటల్): పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌పై విస్తృత ప్రచారం చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ చెప్పారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీ పీఎన్‌డీటీ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. కొత్త స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్ స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, మాడిఫికేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను సభ్యులు పరిశీలించారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా రెండు, రెన్యువల్ 8, మాడిఫికేషన్ దరఖాస్తులు ఏడింటిని ఆమోదించారు. ఈ సందర్భంగా డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ మాట్లాడుతూ.. దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ఆమోదం కోసం పంపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పీసీ పీఎన్‌డీటీ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలన్నారు. ఏపీఎస్ ఆర్‌టీసీ బస్సుల్లో స్టిక్కర్లు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్టర్లు అతికించడం, హోర్డింగ్‌ల ఏర్పాటు చేయాలన్నారు. యాక్ట్ ప్రకారం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, పీసీ పీఎన్‌డీటీ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఉమ, వైద్యాధికారులు స్నిగ్ద, సుహాసిని, పద్మలత, ఎన్‌జీవోలు ఎం.నాగరాజు, కొమ్ముపాలెం శ్రీనివాసులు, డెమో ప్రకాష్‌రాజు పాల్గొన్నారు.


