కర్నూలు(సెంట్రల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో కూటమి ప్రభుత్వ గూండాలు సీపీఐ, సీపీఎం, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీటీసీ అభ్యర్థులపై దాడులు చేసి నామినేషన్ పత్రాలు చింపేయడం దుర్మార్గమని, ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడమే అవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సీఆర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే కూటమి పాలకులు వారు మాత్రం పాటించకపోవడం అన్యాయమన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను కనీసం నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారంటే వారిలో భయం మొదలైందన్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించిన టీడీపీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పత్తికొండ, చిప్పగిరి, ఆలూరు, మంత్రాలయం, కృష్ణగిరి మండలాల్లో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించి సీపీఐ అభ్యర్థులు నామినేషన్లను వేయకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం చంద్రబాబు వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కె.జగన్నాథం పి. రామకష్ణారెడ్డి బి.విరుపాక్షి కె .శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


