ఎమ్మిగనూరు రూరల్: జిల్లాకు రానున్న 24, 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్రచౌదరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతు తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా మారనుందన్నారు. 25, 26వ తేదీల్లో తీవ్ర వాయుగుండంగా, 27వ తేదీన తుపానుగా మారవచ్చన్నారు. ఈ తుపాను ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ – ఒడిశా తీర ప్రాంతాల వైపు కదిలే అవకాశం ఉందన్నారు. 24, 25, 26వ తేదీల్లో జిల్లాలోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు 35–40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,46,53,864 సమకూరింది. శుక్రవారం స్థానిక రాజాంగణ భవనంలో 22 రోజులకు సంబంధించి కానుకలు లెక్కించారు. నగదు రూపేణా రూ.3,36,41,364 రాగా.. నాణేలా రూపంలో రూ.10,12,500 వచ్చింది. ఇక 42 గ్రాముల బంగారం, 645 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరినట్లు మేనేజర్ ఎస్‌కే. శ్రీనివాసరావు వివరించారు.
నంద్యాలలో కొత్త డీసీసీబీ
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో కొత్తగా ఆరు జిల్లా సహకార కేంద్రబ్యాంకులు ఏర్పాటుకు అద్యయనం పూర్తయిందని, ఇందులో భాగంగా నంద్యాలలో కూడా డీసీసీబీ ఏర్పాటవుతుందని.. అయితే ఆర్‌బీఐ నుంచి లైసెన్స్‌లు రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు(ఆప్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలులోని జిల్లా సహకార కేంద్రబ్యాంకును తనిఖీ చేశారు. సీఇవో బాలాజీ రావు, ఇతర సీనియర్ అధికారులతో బ్యాంకు ప్రగతి, రాబోయే ఆరు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సభకార సంఘాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కరువు ప్రాంతాల్లో గతంలో తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూల్ చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా స్వల్పకాలిక రుణాల పంపిణీకి ప్రతి సంఘానికి కనిష్టంగా రూ.20 లక్షలు, గరిష్టంగా రూ.కోటి బడ్జెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు బంగారంపై కూడా రుణాలు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు పి.రామాంజనేయులు, శివలీల, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, డీసీసీబీ డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్, నాగిరెడ్డి పాల్గొన్నారు.
నేడు గొలుసు తెంపుట
హొళగుంద: దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాల్లో రెండో ప్రధాన ఘట్టమైన గొరువయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసిల క్రీడోత్సవాలు శనివారం జరగనున్నాయి. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. బల్లూరుకు చెందిన గొరువయ్య గొలుసు తెంపడం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. మాళమల్లేశ్వరస్వామి విగ్రహాలు, పల్లకీ కంకణ విసర్జనలో భాగంగా గిరిపైనున్న ఆలయానికి చేరుతాయి. అక్కడి నుంచి ఆదివారం నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
క్వింటా ఉల్లి రూ.4,625
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర క్రమంగా పెరుగుతోంది. మార్కెట్‌కు శుక్రవారం 1,355 క్వింటా ళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. కనిష్ట ధర రూ.1,212, గరిష్ట ధర రూ.4,625 లభించగా.. సగటు ధర రూ.3,391 నమోదైంది. రీటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కిలో రూ.32 ప్రకారం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.


