గెలిచే దమ్ములేక అభ్యర్థులపై దాడులు | - | Sakshi
Sakshi News home page

గెలిచే దమ్ములేక అభ్యర్థులపై దాడులు

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

మహిళలపై దాడులు సిగ్గుచేటు

అభివృద్ధికి మారుపేరుగా

తీర్చిదిద్దుతా

కర్నూలు(టౌన్‌): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులు బురఖా ధరించి నామినేషన్లు దాఖలు చేస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోందని, ప్రజలు గమనించాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి గెలిచే దమ్ములేకే అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గిప్సన్‌ కాలనీలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధ్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే డిపాజిట్లు దక్కవన్న సంగతి తెలిసే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నార న్నారు. ఆలూరులో ఎంపీటీసీగా నామినేషన్‌ వేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి ఎస్‌ఐ చొక్కా పట్టుకొని లాక్కెళ్లాడన్నారు. కర్నూలులో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు అధికార పార్టీ నేతలు ఫోన్లు చేస్తున్నారని, పోలీసులతో ఒత్తిళ్లు చేయిస్తున్నారన్నారు. రూ.30 లక్షలు ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నారని, దీన్నిబట్టి వాళ్లు ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతోందన్నారు.

టీడీపీ మేయర్‌ అభ్యర్థి కుటుంబానికి కాల్‌మనీ కేసులతో సంబంధం?

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి సుశీల బీఏ బీఈడీ చదువుకున్న విద్యావంతురాలని, ఆమె భర్త మణిగాంధీ ఎమ్మెల్యేగా.. ఆయన తండ్రి శిఖామణి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ చరిత్ర ఉందని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. అయితే మంత్రి టీజీ భరత్‌ కర్నూలు అసెంబ్లీ పరిధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లేక మునగాలపాడు నుంచి తెచ్చుకున్నారని చెబుతున్నారని, మునగాలపాడు కర్నూలు కార్పొరేషన్‌లో ఉందనే విషయం తెలుసుకోవాలన్నారు. టీడీపీ మేయర్‌ అభ్యర్థి తండ్రి బొల్లెద్దుల రామక్రిష్ణ కాల్‌మనీ కేసులో నిందితుడని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ పాల్గొన్నారు.

నామినేషన్లు వేసేందుకు వస్తున్న మహిళలపై టీడీపీ గుండాలు, రౌడీలు దాడులు చేయడం సిగ్గు చేటు. మాజీ మంత్రి విడదల రజనీ తన ఇంట్లో నుంచి బయటకు వస్తే పోలీసులతో నిర్బంధించడం, తోసేయడం దారుణం.

– ఎస్వీ విజయమనోహరి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షురాలు

చంద్రబాబు పాలనలో మూడేళ్లుగా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఇప్పటికీ ప్రజలు కర్నూలు నగరంలో మంచినీరు, ట్రాఫిక్‌, మురుగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీలో రహదారుల విస్తరణ పూర్తిగా విస్మరించారు. మంత్రి హోదాలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే టీజీ భరత్‌ ప్రజలకు నిరాశ మిగిల్చారు. మేయర్‌గా అవకాశం కల్పిస్తే అభివృద్ధికి మారుపేరుగా కర్నూలును తీర్చిదిద్దుతా.

– సుశీల, కర్నూలు మేయర్‌ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement