కర్నూలు(హాస్పిటల్): రోగుల వద్దకు అధిక సంఖ్యలో సందర్శకులు రాకుండా వచ్చే నెల నుంచి విజిటర్ పాస్ విధానం అమలు చేయనున్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో హెచ్ఓడీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను బయట కొనుగోలుకు రాయకూడదని స్పష్టం చేశారు. కొంత మంది పీజీ వైద్యులు, హౌస్సర్జన్లు పరీక్షలకు బయటకు రాస్తున్న విషయమై హెచ్ఓడీలు తమ విభాగాల్లో వైద్యులకు తగిన సూచనలు చేసి, ఇలాంటి చర్యలు నివారించాలని ఆదేశించారు. సమావేశంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మిబాయి, డాక్టర్ నాగేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ పి.పద్మజ పాల్గొన్నారు.


