● కాళరాత్రిలో కర్రల కరాళ నృత్యం ● పలువురికి తీవ్ర గాయాలు ● బన్ని ఉత్సవంలో సంప్రదాయానిదే పైచేయి
హొళగుంద: దేవరగట్టు మళ్లీ నెత్తురోడింది. విజయదశమి పురస్కరించుకుని జరిగిన బన్ని ఉత్సవంలో గట్టుపై రక్తం చిందింది. కర్రలు కరాళనృత్యం చేసిన కాళరాత్రి వేళ పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మాళ మల్లేశ్వరుని జైత్రయాత్రలో కర్రల మొగలాయి యుద్ధాన్ని తలపించింది. అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర గురువారం తెల్లవారుజాము వరకు సాగింది. దేవరగట్టు పరిసరాల్లోని దాదాపు 15 గ్రామాల భక్తులు ఉత్స వంలో పాల్గొని మొగలాయి ఆడారు. రక్తపాతాన్ని అడ్డుకునేందుకు జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఫలించలేదు. ఏఎస్పీలు, డీఎస్పీలు మొ దలుకొని వెయ్యి మందికి పైగా బందోబస్తు విధుల్లో పాల్గొన్నా కాళరాత్రి వేళ రక్తపాతాన్ని అడ్డుకోలేకపోయారు. రాష్ట్రం నుంచే గాక పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అర్ధరాత్రి గిరిపై మోగిన
కల్యాణ మేళాలు
నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఇనుప తొడుగులు తొడిగిన కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడసిద్దప్ప మఠంలో ఉంచిన మల్లేశ్వరుని విగ్రహంతో పాటు పల్లకీని మోసుకుని నిమిషాల వ్యవధిలో కొండ(గిరి)పై ఆలయంలో ఉంచిన మాత మాళమ్మ విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నెరణికి పురోహితులు రవిశాసీ్త్ర, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తులు జయజయధ్వానాల మధ్య మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం అక్కడి నుంచి మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని మోసుకుని కొండ దిగువకు ఊరేగింపుగా తీసుకు వ స్తుండగా అక్కడే తిష్ట వేసిన ఇతర గ్రామాలకు చెందిన కొందరు భక్తులు అటకాయించారు. ఒకరిపై ఒకరు అగ్గి కాగడాలు విసురుకున్నారు. వారిని తప్పిస్తూ కర్రల శబ్దాలతో, డిర్రు... డిర్రు అంటూ విగ్రహాలను మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టించారు.
నడి అరణ్యంలో రక్తం చిందించిన కంఛాబీర వంశస్తుడు
జైత్రయాత్ర దట్టమైన అడవిలోని ముళ్లబండ, పాదాల గట్టు మీదుగా రాక్షసపడి గుండ్ల వద్దకు చేరుకుంది. కంఛాబీర వంశానికి చెందిన బసవరాజు అనే భక్తుడు తన ఎడమ కాలు పిక్కలో డబ్బణం గుచ్చుకుని రక్తాన్ని రాక్షస గుండ్లకు సమర్పించాడు. అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలను శమీ వృక్షం వద్దకు తీసుకెళ్లారు. భక్తులు కర్రలు, ఆయుధాలను ఉంచి పూజలు నిర్వహించారు.
రేపు రథోత్సవం
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వా మివారి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉద యం నెరణికి గ్రామ పురోహితులతో పంచామృతం, బండారార్చన, సాయంత్రం రథోత్సవం నిర్వహి స్తారు. అలాగే 22న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వ సంతోత్సవం, కంకణ విసర్జన, 23న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
దేవరగట్టులో కర్రల సమరం
జైత్రయాత్రలో చిందిన రక్తం
స్వామివారి జైత్రయాత్ర సత్య నారాయణ కట్ట, కాడసిద్దప్ప మఠం పరిసరాల్లో కొద్దిసేపు అలజడి సృష్టించి ముందుకు కదలగా భక్తుల కర్రలు తగిలి ఎన్నో తలలు పగిలాయి. భక్తులు చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలా మంది గాయపడ్డారు. పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది భక్తుల ఒళ్లు కాలిపోయాయి. క్షతగాత్రులకు డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో గట్టులో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో చికిత్స అందించారు.


