ఆలయంలోని గుండంలో స్వామిఅమ్మవార్లకు అవబృధం కార్యక్రమం
నందివాహన సేవలో స్వామిఅమ్మవారు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మికభరితంగా సాగిన దసరా మహోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నందివాహనసేవలో ఆదిదంపతులు విహరించారు. విజయదశమి రోజున స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. పూర్ణాహుతితో దసరా మహోత్సవాలు ముగిశాయి.
శ్రీ భ్రమరాంబాదేవి అలంకారం
దసరా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం సా యంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని భ్రమరాంబాదేవి స్వరూపంలో (నిజాలంకరణ) అలంకరింపజేసి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అష్టభుజాలు కలిగిన ఈ దే విశూలం, బాకు, గద, ఖడ్గం ,విల్లు, డాలు, పరిఘ మొదలైన ఆయుధాలను ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.
నందివాహనసేవ
విజయదశమి రోజున సాయంత్రం నందివాహన సేవ నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు.
శమీ పూజ
సాయంత్రం ఆలయ ప్రాంగాణంలోని శమీ వృక్షానికి శాస్త్రోక్తంగా పూజాదికాలను జరిపారు. అనంతరం నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను శమీ వృక్షం చుట్టు ప్రదక్షిణ చేయించారు.
నేత్రానందభరితంగా తెప్పోత్సవం
స్వామిఅమ్మవార్లకు మంగళవారం సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద నేత్రానందభరితంగా తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించి, ఆలయ రాజగోపురం నుంచి ఊరేగింపుగా తోడ్కోనివచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పపై వేంచేంబు చేయించి విశేష పూజాదికాలను నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం నిర్వహించారు.


