కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే ముఖ్య వ్యవస్థలైన పోలీసు, రెవెన్యూ శాఖలు గాడి తప్పుతున్నాయని జిల్లా పరిషత్ రిటైర్డు సీఈఓ జీ.జయపాల్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు వివిధ ఫోరంల ద్వారా విజ్ఞప్తి చేసేవన్నారు. కానీ ప్రస్తుతం నామినేషన్ల పక్రియ అనేక అనుమానాలు, విమర్శలకు తావిస్తోందన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పలు వ్యవస్థలు కొందరికి కొమ్ము కాయడం తగదని సూచించారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లేవని, అతిగా ప్రవర్తించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే వారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. అతి ముఖ్యమైన వ్యవస్థలు గాడి తప్పడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. బలమున్నవాడిదే రాజ్యమైతే ప్రతి వాడు బలవంతుడు అయ్యేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. పెద్దగా ప్రాధాన్యత లేని ఎన్నికల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి దాపురించడం మంచిది కాదన్నారు.


