మద్దికెర: దేశంలో మైసూరులో తర్వాత ఎక్కడా లేని విధంగా మద్దికెరలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గుర్రాల పారువేటలో యామనగరి కుటుంబానికి చెందిన గుర్రం ముందుగా మద్దికెరకు చేరుకొని విజయం సాధించింది. విజయదశమి పండుగ పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పారు వేట కార్యక్రమం అశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దనగిరి, చిన్న నగిరి, యామనగిరి కుటుంబాలకు చెందిన వారు ఠీవిగా గుర్రాలపై కూర్చుని తమ వెంట ఆయుధాలు ధరించిన సైనికులతో ఊరేగింపుగా గ్రామ సరిహద్దులో ఉన్న రాగి మాను కట్ట వద్దకు వచ్చారు. అనంతరం గ్రామానికి 3 కి.మీ దూరంలో బొజ్జనాయుని పేట గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి పందెం ప్రారంభించారు. మూడు కుటుంబాలకు చెందిన గుర్రాలు పారువేటలో పాల్గొనగా యామనగరి వంశీయులకు చెందిన అశ్వం ముందుగా లక్ష్యాన్ని చేరుకుంది. అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారిలో అశేష జనవాహిని మధ్య విజయం సాధించిన అశ్వాన్ని ప్రత్యేకంగా ఊరేగించారు. ఉత్సవాన్ని తిలకించడానికి గ్రామప్రజలే గాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పారువేట ఉత్సవంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ నరేష్ బందోబస్తు నిర్వహించారు.


