● బావిలో జారిపడి వ్యక్తి మృతి
కృష్ణగిరి: మండల పరిధిలోని కటారుకొండ గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. శివాలయం పక్కన ఉన్న బావిలో పూలు వేసేందుకు వెళ్లి కాలు జారి పడటంతో నీట మునిగి వ్యక్తి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల రంగడు (46) మంగళవారం దసరా పండుగ పూజ చేసి సాయంత్రం పూలను శివాలయం సమీపంలోని బావిలో వేసేందుకు వెళ్లాడు. అక్కడ కాలు జారి బావిలో పడిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో గాలించగా బుధవారం తెల్లవారుజామున బావిలో మృతదేహం కనిపించింది. శవాన్ని బయటకు తీశారు. పండుగ పూట వ్యక్తి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య మహేశ్వరి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


