చిప్పగిరి: స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మండలంలో వైఎస్సార్ సీపీ తరపున ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. టీడీపీకి దమ్ముంటే తమ అభ్యర్థులు నామినేషన్లు వేసుకునేందుకు అవకాశం కల్పించి పోటీలో గెలవాలని సవాల్ విసిరారు. చిప్పగిరి, హొళగుంద, ఆలూరు ఎస్‌ఐలు ఆయా మండలాల్లో తమ అభ్యర్థుల ఇళ్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి తమ అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులతో నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి, ఆమె భర్త వైకుంఠం శివ ప్రసాద్ పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఎన్నికలలో పోటీకి భయమెందుకని ప్రశ్నించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఉనేబాది మల్లికార్జున, ఎంపీపీ అభ్యర్థి సర్వర్ ఖాన్, విక్రాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విరుపాక్షి హౌస్ అరెస్ట్
కనీస సమాచారం ఇవ్వకుండా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిని బుధవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పార్టీ అభ్యర్థులు ప్రతిచోటా బరిలో ఉంటారన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు.


