మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీచట్టానికి ముగింపు
2007లో దివంగత వైఎస్సార్ చేతుల మీదుగా పథకానికి శ్రీకారం
నాడు వ్యవసాయ కూలీలు, సన్న, చిన్న కారు రైతుల ఉపాధే లక్ష్యం
నేడు అన్ని వర్గాల ఉపాధిని దూరం చేయనున్న కొత్త పథకం
ఇప్పటి వరకు 100 శాతం వేజ్ కేంద్రమే భరిస్తున్నా చెల్లింపుల్లో అస్తవ్యస్తం
ఇకపై కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం
జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనులు
కర్నూలు(అగ్రికల్చర్): పేదల ఉపాధి ప్రశ్నార్థకమవుతోంది. జూలై 1 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీ రామ్‌జీతో పేదల ఉపాధిపై కోలుకోలేని దెబ్బపడనుంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పేదల ఉపాధికి గండికొట్టి నోటికాడి ముద్దను లాగేసేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. కొత్త చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో ఉపాధి శ్రామికులకు కొత్త కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న జాబ్ కార్డుల్లో కుటుంబానికి 100 రోజుల ఉపాధి అనేది ప్రముఖంగా ఉంటోంది. కొత్త చట్టం ప్రకారం కుటుంబానికి 125 రోజుల పని దినాలు లభించనున్నాయి. లేబర్ కాంపోనెంటు కింద కొత్త చట్టం ప్రకారం 15 రోజుల్లో వేజ్ చెల్లించాలి. అలా చెల్లించపోతే పరిహారం కూడా చెల్లించాల్సి ఉంది. అయితే వీబీజీ రామ్ జీతో వ్యక్తిగత లబ్ధిపై ఆంక్షలు విధించడంతో సన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘతం ఏర్పడుతోంది.
దివంగత ముఖ్యమంత్రి
వైఎస్‌ఆర్ చేతుల మీదుగా ‘ఉపాధి’
పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో అనంతపురం జిల్లాలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలసి ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఉపాధి నిధులతో పండ్లతోటల అభివృద్ధికి పెద్దపీట వేసి సన్న, చిన్నకారు రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించారు. నేడు జిల్లాలో పండ్లతోటలు కళకళలాడుతున్నాయంటే వైఎస్సార్ కృషి ఫలితమే.
ఉమ్మడి జిల్లాలో
లక్షల కుటుంబాలకు దెబ్బ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కర్నూలు జిల్లాలో 2.75 లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 2.25 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఏటా ఈ కుటుంబాలకు 1.85 కోట్ల పని దినాలు కల్పిస్తున్నారు. కొత్తగా తెస్తున్న వీబీజీ రామ్‌జీతో ఉమ్మడి జిల్లాలో లక్షల కుటుంబాలకు నష్టం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో కేంద్రానిదే పూర్తి అధికారం ఉన్నప్పటికీ లేబర్ కాంపోనెంటు, మెటీరియల్ కాంపోనెంటు కింద 2025–26, 2026–27లో ఉపాధి కూలీలకు వేజ్ చెల్లింపులు అస్తవ్యస్తమయ్యాయి. చెల్లింపులు లేకపోవడం వల్ల ఉపాధి పనులకు లేబర్ హాజరు తగ్గిపోయింది. కొన్ని నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో రెండవ విడత పల్లె పండుగను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మరోవైపు పండ్లతోటలకు సంబంధించి ఏడాదిన్నరగా నిర్వహణ చెల్లింపులు నిలిచిపోయా యి. ఈ నేపథ్యంలో కొత్త పథకం అమలులోకి వచ్చిన తర్వాత లేబర్, మెటీరియల్ పనులకు చెల్లింపులు సక్రమంగా జరుగుతాయా, లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వ్యక్తిగత సబ్సిడీ
రూ.2 లక్షల వరకే...
ఉపాధి నిధులతో వ్యక్తిగత ఆస్తులు అభివృద్ధి చేసుకోవడం.. అంటే పండ్లతోటల అభివృద్ధి, ఫాంపాండ్స్ తవ్వకాలు తదితరాలకు ఇస్తున్న సబ్సిడీని రూ.2 లక్షలకు పరిమితం చేశారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు కూడా జరిగిపోయాయి. 2024–25 వరకు పండ్లతోటల అభివృద్ధిలో గరిష్టంగా ఐదు ఎకరాల వరకు పూర్తి సబ్సిడీ పొందే అవకాశం ఉండింది. మరోవైపు ఫాంపాండ్స్ వంటి వాటిని తవ్వుకోవడం ద్వారా కూడా సబ్సిడీలు పొందుతున్నారు. ఇప్పటి వరకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ వర్తించింది. 2025–26లో మాత్రం వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధిలో సబ్సిడీని రూ.2 లక్షలకే పరిమితం చేయడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
నేటి నుంచివీబీజీ రామ్‌జీ అమలు
ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ కాంపోనెంటు కింద చేపడుతున్న పనులకు 100 శాతం వేజ్ కేంద్రం భరిస్తోంది. మెటీరియల్ కింద చేపట్టే పనులకు 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరిస్తోంది. కొత్త చట్టం ప్రకారం లేబర్, మెటీరియల్ కాంపోనెంటు కింద చేపట్టే పనులకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర భరించాల్సి ఉంది. ఆ మేరకు చేపట్టే లేబర్, మెటీరియల్ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అకౌంటుకు రాష్ట్ర వాటా విడుదల చేసిన తర్వాతనే నిధులు విడుదలవుతాయి. నిత్యం అప్పులతో నెట్టుకొస్తున్న చంద్రబాబు సర్కార్ తమ వాటా నిధులు అంత సులభంగా ఇచ్చే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.


