ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి అండతోనే అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి అండతోనే అరాచకాలు

Jul 1 2026 5:14 AM | Updated on Jul 1 2026 5:14 AM

ఆలూరు రూరల్‌: టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అండతోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో టీడీపీ కార్యకర్త వీరేష్‌ వేధింపులకు పాల్పడి, దుర్భాషలాడటంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంగన్‌వాడీ టీచర్‌ లేపాక్షిని మంగళవారం ఆయన ఆలూరు ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ గుండా రాజ్యం నడుస్తోందన్నారు. నాలుగు నెలలుగా అంగన్‌వాడీ టీచర్‌ లేపాక్షిని వేధింపులకు గురి చేస్తూ బయటకు చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడడం చాలా దారుణమ న్నారు. ఈ నెల 20న వైకుంఠం జ్యోతి పుట్టిన రోజు వేడుకల్లో వీరేష్‌ పాల్గొని ఫొటో దిగినా, అతనితో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కొన్ని రోజుల క్రితం హాలహర్వి మండలంలోని కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఆ మండల టీడీపీ నాయకుడు దుర్భాషలాడి పాఠశాలలో హంగామా సృష్టించాడన్నారు. దేవనకొండ మండలంలో టీడీపీ నాయకులు ఉపాఽధి హామీ కార్యాలయానికి తాళాలు వేస్తే అధికారులు భయపడి కార్యాలయానికి రాకుండా ఉంటే తాను కలెక్టర్‌తో మాట్లాడి తాళాలు తెరిపించానన్నారు. ఇలాంటి టీడీపీ గుండాలను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పెంచి పోషిస్తున్నారన్నారు. టీడీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ప్రతి గ్రామంలో చిచ్చుపెట్టి తన అనుచరులను, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దాదాపు 200 ఎకరాల ఫారెస్ట్‌ భూమి కబ్జాకు యత్నించాడన్నారు. హొళగుంద మండలంలోని చిన్నహ్యాట గ్రామంలో గ్రావెల్‌ దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. వీరికి పోలీసులే అండగా నిలుస్తుండటం దారుణమన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే అండగా ఉంటానన్నారు. ఎమ్మెల్యే వెంట సీడీపీఓ నరసమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement