అమరావతి దోపిడీ బయట పడుతుందనే దాడులు
కర్నూలు (టౌన్): అమరావతిలో చంద్రబాబు నాయుడి దోపిడీ బయటపడుతుందనే టీడీపీ గూండాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. అమరావతి రైతుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ లపై రాళ్లతో దాడులకు తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో రైతుల భూములు లాక్కోవడం, రైతులను ఇబ్బందులకు గురిచేయడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు స్వయంగా పరిశీలించేందుకు వెళ్లారన్నారు. అయి తే పోలీసుల సమక్షంలోనే రైతుల ముసుగులో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారన్నారు. అరాచక ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. 2029 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి నేతలు వీసాలు తీసుకుని విదేశాలకు పారిపోయే పరిస్థితి తప్పదన్నారు.
పాలకులు ప్రజల్లో తిరగలేరు..
హామీలు విస్మరించిన పాలకులు ఇక ప్రజల్లో తిరగలేరని ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్లలోనే నిలదీసే పరిస్థితి తెచ్చుకున్నారన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారిధిని అక్కడి నియోజకవర్గ మహిళలు హామీలు ఏమయ్యా యని ప్రశ్నిస్తుంటే నవ్వి తప్పించుకోవడం సిగ్గు చేటన్నారు. రెండేళ్లుగా హామీలు అమలు చేయలేదని, ఇళ్లు ఇవ్వలేదని అడుగుతుంటే చేసేదేమిలేక ముఖం చాటేశారన్నారు. చివరికి అక్కడ ఉన్న కూటమి నేతలు, కార్యకర్తలు సైతం అభివృద్ధి, హామీలపై ప్రశ్నించారన్నారు. ఊర్లలో తిరగలేని పరిస్థితి ఉందని చెప్పేందుకు ఆదోని ఎమ్మెల్యే ఘటననే నిదర్శనమన్నారు.


