కర్నూలు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ అన్నారు. బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం సమర్థవంతమైన అమలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర అంశాలపై మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ పిల్లలందరినీ బడికి వెళ్లేలా ప్రోత్సహించాలని కోరారు. కర్నూలు నగరంలో బాలకార్మికులను గుర్తించడానికి బస్సులను ఏర్పాటు చేసిన రెండు బృందాలకు లీలా వెంకటశేషాద్రి, వెంకటహరినాథ్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజేష్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ మధుసుధాకర్, టూటౌన్ ఎస్‌ఐ నాగేంద్ర తదితరులతో కూడిన బృందాలు నగరంలో పర్యటించాయి. ముగ్గురు బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వీధి బాలలు కనిపిస్తే లీగల్ సర్వీసెస్ టోల్‌ఫ్రీ నెంబర్ 15100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098కు తెలియజేయాలని కోరారు.


