కర్నూలు(సెంట్రల్): సర్‌తో డూప్లికేట్ ఓటర్లను గుర్తించి ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అమలుపై అడిషనల్ అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడడం ఎన్నికల యంత్రాంగం ప్రధాన బాధ్యత అన్నారు. అదే సమయంలో ఒక్క వ్యక్తికి ఒక్క ఓటే ఉండేలా చూడడంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సస్పెన్షన్ తప్ప మరో మార్గం ఉండదన్నారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, ఎమ్మిగనూరు మునిసిపల్ కమిషనర్ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


