కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఆదివారం ప్రారంభం అయ్యింది. ప్రభుత్వ(టౌన్ మోడల్)జూనియర్ కాలేజీలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, చరిత్ర, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మైనర్ లాంగ్వేజెస్, మైనర్ మీడియ మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు ఏసీఓలుగా 32 మంది, ఛీఫ్ ఎగ్జామినర్లుగా 153 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా 1446 మంది, స్క్రూటీనైజర్లుగా 188 మందిని నియమించారు. మొదటి రోజున 450 మందికిగాను 385 మంది విధుల్లో చేరి 5,745 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. రేపటి(మంగళవారం)నుంచి కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం జరుగనుంది. ఈ నెల 13వ తేదీ వరకు స్పాట్ క్యాంపు జరుగనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్‌లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
22 మండలాల్లో వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు 22 మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హాలహర్విలో 92.6, హొళగుందలో 53.2, చిప్పగిరిలో 30.2, పత్తికొండలో 27.4, కౌతాళంలో 26.4, గోనెగండ్లలో 14.4, ఎమ్మిగనూరులో 14.2, కోడుమూరులో 13.8, ఆదోనిలో 12.6, ఓర్వకల్లులో 11.4 మి.మీ. ప్రకారం వర్షాలు కురిశాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మిమీ ఉండగా.. ఇప్పటి వరకు 33.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
దివ్యాంగుల హాస్టల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): సీ క్యాంప్‌లోని దివ్యాంగుల వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ వసతి గృహంలో 2026–27 విద్యా సంవత్సరానికి వంద మంది వరకు ఉచిత వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రవేశం పొందే విద్యార్థులు సదరం, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలు, తల్లిదండ్రుల అంగీకార పత్రం, బ్యాంకు అకౌంట్ నంబర్ ఉన్న మొదటి పేజీ జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేయాలన్నారు. వసతి గృహంలో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చేసే వారు కూడా ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 08518– 277864, 8985547169 నంబర్లను సంప్రదించాలన్నారు.
కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత కలిగిన వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటమాని హెచ్చరించారు.


