‘సెస్సా’ దియ్యా! | - | Sakshi
Sakshi News home page

‘సెస్సా’ దియ్యా!

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

సెస్‌ చెల్లించాలని కోరుతున్నాం

గ్రంథాలయాలకు బకాయి భారం అభివృద్ధికి ఆటంకంగా మారిన వైనం

కర్నూలు కల్చరల్‌: దశాబ్దాలుగా పేరుకు పోయిన పన్నులు స్థానిక సంస్థల నుంచి రాక అక్షర జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధి అటకెక్కింది. కర్నూలు నగర పాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలు, మేజర్‌ గ్రామ పంచాయతీలు, పంచాయతీల నుంచి సెస్సు వసూలు కావడం లేదనేది గ్రంథాలయాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 60 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కేంద్ర గ్రంథాలయం, ఒకటి గ్రామీణ గ్రంథాలయం, 58 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. 39 సొంత గ్రంథాలయాలు ఉండగా 8 గ్రంథాలయాలు రెంట్‌ ఫ్రీ, 12 గ్రంథాలయాలకు అద్దె చెల్లిస్తున్నారు. వీటితో పాటు పుస్తక నిక్షిప్త కేంద్రాలు (బీడీసీ) ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సుమారు 15 వేల మంది సభ్యులు ఉండగా మిగతా శాఖల్లో 70 వేల మంది ఉన్నారు. కేంద్ర గ్రంథాలయానికి రోజుకు 400 మంది వరకు పాఠకులు హాజరవుతుంటారు. మిగతా వాటికి సుమారు 12 వేల మంది పాఠకులు వస్తుంటారు.

రూ. 20 కోట్ల మేర బకాయిలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు రూ. 20 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించి రూ. 8.67 కోట్లు, కర్నూలు కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు రూ. 5.32 కోట్లు, గ్రామ పంచాయితీలు రూ. 3.35 కోట్లు రావాల్సి ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం రూ. 11.53 కోట్లు, మున్సిపాలిటీలు రూ. 10.01 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ. 1.50 కోట్లు బకాయి రావాల్సి ఉంది. వీటిని చెల్లించాలని జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులకు విన్నవిస్తునే ఉన్నారు. ఆ మొత్తం వస్తే అభివృద్ధి పనులు, పుస్తకాల కొనుగోలు, నిర్వహణ, పేపర్‌ బిల్లులు, జీతభత్యాలు చెల్లింపులకు ఉపయోగ పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.

రెగ్యులర్‌గా సెస్సు చెల్లించే

గ్రామ పంచాయతీలు

● మొలగవెల్లి, ఉయ్యాలవాడ, వెలుగోడు, గోస్పాడు, కోవెలకుంట్ల, ఆలూరు.

సెస్సుచెల్లింపులో నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీలు

● వెల్దుర్తి, తుగ్గలి, రుద్రవరం, ప్యాపిలి, ఓర్వకల్‌, కల్లూరు, మంత్రాలయం, కొత్తపల్లి, కోడుమూరు, గడివేముల.

గ్రంథాలయాలకు చెల్లించాల్సిన పన్నును స్థానిక సంస్థలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు రూ. 23.50 కోట్లు సెస్సు బకాయి ఉండేది. ఇటీవలే కర్నూలు నగర పాలక సంస్థ నుంచి రూ. 2 కోట్లు, నంద్యాల మున్సిపాలిటీ నుంచి రూ. 1.50 కోటి వసూలు అయింది. దీంతో కొంత ఉపశమనం కలిగింది. నిధుల లేమితో మరమ్మతులు చేయించడం, మౌలిక వసతుల కల్పన కష్టంగా మారింది. సెస్సు వసూలై పరిపాలన అనుమతులు లభిస్తే పనులు మొదలు పెడతాం.

– కె. ప్రకాష్‌, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ

Advertisement
 
Advertisement
Advertisement