పొలంబడి.. వెనుకబడి | - | Sakshi
Sakshi News home page

పొలంబడి.. వెనుకబడి

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రజారోగ్యం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌ (గ్యాప్‌) పద్ధతులకు పెద్దపీట వేసింది. పొలంబడులు నిర్వస్తూ పంటల సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఆర్‌బీకేల వారీగా నిర్వహించే పొలంబడి కార్యక్రమాలను నామమాత్రానికి పరిమితం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 14 పొలంబడి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించేందుకు ఆదేశాలు వచ్చాయి. ఇందులో జిల్లాకు ఒకటి ప్రకారం ‘గ్యాప్‌’ పొలంబడులు నిర్వహిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ‘గ్యాప్‌’ పద్ధతులకు మంగళం పలకడంతో ఆహార పంటల్లో కెమికల్స్‌ అవశేషాలు పెరుగుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

ఇదీ దుస్థితి..

చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అయిపోయింది. రెండేళ్లలో అన్నదాత సుఖీభవ అమలు చేసింది ఒక్క ఏడాది మాత్రమే. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలే కాలేదు. ఉచిత పంటల బీమాకు స్వస్తి పలికారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులకు ఏటేటా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమానికి స్వస్తి పలికారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు నిర్వహించే ‘గ్యాప్‌’ పొలంబడి కార్యక్రమాలను జిల్లాకు ఒక్కటి మాత్రమే పరిమితం చేసింది. ఒకవైపు డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియా పంపిణీలో చేతులెత్తేసి మరోవైపు కెమికల్స్‌ వ్యవసాయానికి గేట్లు ఎత్తుతోంది. చంద్రబాబు ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో అధికారులు గ్యాప్‌ పద్ధతుల అమలుకు చొరవ తీసుకోలేదు. దీంతో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని పెంచారు. పండించిన పంట ఉత్పత్తులను సర్టిఫికేషన్‌ కోసం శ్యాంపుల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపితే కెమికల్స్‌ మోతాదుకు మించి ఉన్నట్లు తెలిసింది. ‘గ్యాప్‌’కు మంగళం పలుకడం వల్లనే మిర్చిలో మోతాదుకు మించి కెమికల్స్‌ అవశేషాలు ఉన్నట్లు తేలింది.

‘పొలంబడు’లను పక్కనపెట్టిన

చంద్రబాబు ప్రభుత్వం

జిల్లాకు గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌

పొలంబడి ఒక్కటి మాత్రమే

ఇక ప్రజలకు కెమికల్స్‌ అవశేషాలు

కలిగిన ఆహారమే దిక్కు!

Advertisement
 
Advertisement
Advertisement