● గ్రామాల్లో జోరుగా బెల్ట్ షాపులు
● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ శాఖ
అధికారులు
ఎమ్మిగనూరుసెంట్రల్: జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తాగడానికి గుక్కెడు మంచి నీరు దొరకదేమో కానీ మద్యం మాత్రం లభిస్తోంది. టీడీపీ నాయకుల అండతో గ్రామగ్రామానా బెల్టుషాపులు వెలిశాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న మద్యం పాలసీని రద్దు చేశారు. ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం షాపుల నిర్వహణను ప్రెవేట్ వ్యక్తులకు అప్పగించారు. దీంతో మద్యం షాపులను దక్కించుకున్న వ్యక్తులు కాసులు దండుకోవడం కోసం గ్రామానికి రెండు నుంచి ఎనిమిది వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. లైసెన్స్‌డ్ మద్యం షాపులను దక్కించుకున్న టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో ఊరూరా బెల్ట్‌షాపులు పుట్టగొడుగులా వెలిశాయి. దీనికితోడు లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల్లో ఒక వ్యక్తికి మూడు మద్యం సీసాల కంటే ఎక్కువ ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకావడం లేదు. ఎంత అడిగితే అన్ని మద్యం సీసాలు ఇచ్చేస్తున్నారు.
ఎక్కడపడితే అక్కడ అమ్మకాలు
టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో బెల్ట్ షాపులు దక్కించుకున్న అధికార పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గుడి, బడి అనే తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ద్విచక్రవాహనాల్లోనే ఎక్కడ ఉంటే అక్కడికే మద్యం సీసాలు తెచ్చి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లో మినీ డాబాలను తలిపించేలా కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం, గ్లాసులు, వాటర్ బాటిళ్లు, తినుబండారాలు అందిస్తున్నారు. ఇందుకు ఒక సీసాకు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తుండటం, మద్యంబాబుల అరాచకాలు ఎక్కువ కావడంతో మహిళలు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం. అక్రమంగా బెల్ట్‌షాపుల నుంచి మద్యం అమ్మే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. – రమేష్‌రెడ్డి, ఎకై ్సజ్ సీఐ


