ఆదోని అర్బన్: జిల్లాలో కురువలందరూ ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కురువ సంఘం నాయకులు అన్నారు. ఆదోని పట్టణంలోని భీరప్పనగర్‌లో వెలసిన బీరప్ప దేవాలయంలో ఆదివారం కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె.మల్లికార్జున, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, సంఘం పెద్దలు కుబేర్‌నాథ్, జయరామ్, నాయకులు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో కురువ సంఘం సమ్మేళనం జరిగింది. ముందుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కనకదాసు చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురువ సంఘం పెద్దలు, నాయకులు మాట్లాడుతూ.. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. అనంతరం ఆదోని పట్టణాధ్యక్షుడిగా గోల్డ్ రఘును, మండలాధ్యక్షుడిగా చాగి మల్లికార్జునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


