మానవ శరీరం పనితీరు మొత్తం మెదడు మీదే ఆధారపడి పనిచేస్తుంది. అలాంటి మెదడులో ఏ మాత్రం తేడా వచ్చినా కల్లోలంగా మారుతుంది జీవితం. శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక అవగాహన కథనం.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రాంతంలో ఇటీవల కాలంలో మెదడు కణితులుండే బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సమస్యతో పక్క రాష్ట్రమైన తెలంగాణ, కర్ణాటకకు చెందిన వారు కూడా కర్నూలుకే వస్తున్నారు. చికిత్స చేయించుకునేందుకు గతంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కర్నూలు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్నారు. ఇక్కడే ఆధునిక పరికరాలు, వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో చికిత్స సులభమవుతోంది. ఇక్కడి వైద్యుల వద్దకు నరాలు, మెదడు చికిత్సల కోసం వచ్చే వారిలో 10 నుంచి 15 శాతం మంది బ్రెయిన్ ట్యూమర్ కేసులే ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మెదడు కణితులు, రకాలు
మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి జన్యుపర లోపాలతో, వంశపారంపర్యంగా వస్తాయి. మెదడుకు రేడియేషన్ సోకడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. సెల్‌ఫోన్ విపరీతంగా వాడటం వల్ల రేడియేషన్ సోకి మెదడులో గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికీ ఈ సమస్య వస్తోంది.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు
మెదడు కణితుల లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది జనరల్ లక్షణాలు. రెండవది ప్రత్యేకమైనది. జనరల్ లక్షణాలు కణితి పరిమాణాన్ని బట్టి వస్తాయి. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహ కోల్పోవడం వంటివి. ఇక రెండోది మెదడులో కణితి ఏర్పడిన స్థానాన్ని బట్టి వస్తాయి. మెదడు ముందు భాగం, మధ్యభాగం, వెనుక భాగంలో ఆయా స్థానాలను బట్టి లక్షణాలు ఉంటాయి. అందులో మాట తడబడటం, చూపు మబ్బుగా కనిపించడం, చెవులు వినిపించకపోవడం, మూతి వంకరపోవడం, ఫిట్స్ రావడం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి తలనొప్పిని కణితికి కారణం అని చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను తప్పనిసరిగా కలిసి చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
పెరుగుతున్న బ్రెయిన్ ట్యూమర్
బాధితులు
ఆధునిక పద్ధతిలో ట్యూమర్ల తొలగింపు
జీజీహెచ్‌లో ప్రతి ఓపీకి 30 మంది
బాధితుల రాక
నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే


