కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో విద్యుదాఘాతంతో వృద్ధురాలు కాశింశెట్టి లక్ష్మీదేవి మృతి చెందడంతో ఆదివారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. చింత చిగురు కోసేందుకు వెళ్తున్న ఆమె అప్పటికే కొద్ది రోజులు ముందు గాలి వానకు పడిపోయిన విద్యుత్ స్తంభం వద్ద దాటుకునే క్రమంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారించేందుకు డీఎస్పీ అంకిరెడ్డిపల్లె చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. స్తంభం పడిపోయిన విషయాన్ని సిబ్బంది దృష్టికి ఎవరైనా తీసుకెళ్లారా.. అని ఆరా తీశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులతో సమావేశమై ప్రమాదం చోటు చేసుకున్న తీరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ రమేష్‌బాబు, కోవెలకుంట్ల విద్యుత్ శాఖ ఏడీ సతీష్‌కుమార్‌రెడ్డి,అవుకు ఏఈ ఫక్కీరయ్య తదితరులు పాల్గొన్నారు.
క్వింటా వేరుశనగ రూ.7,620
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,620 ధర పలికింది.మార్కెట్‌కు 88 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటం కనిష్ట ధర రూ.5,280, మధ్యస్థ ధర రూ.6,600 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు మార్కెట్‌కు 6 క్వింటాళ్లు రాగా క్వింటం కనిష్ట ధర రూ,4,670, గరిష్ట ధర రూ.5,510 పలికింది.
క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
ఆళ్లగడ్డ: క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా శిల్పకళా కూలీ మృతి చెందిన విషాద సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం గూబగుండం గ్రామానికి చెందిన మునెయ్య (55) పట్టణంలోని శిల్పకళా మందిరాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా పెద్ద రాయి ఎత్తుకుని వెళ్తున్న క్రేన్ తగిలి కిందపడియాడు. అతనిపై క్రేన్ టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట డిగ్రీ కళాశాల సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారు దగ్ధమైంది. మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం సైట్‌సీయింగ్‌కు బయలు దేరారు. మార్గమధ్యలో సున్నిపెంట డిగ్రీ కళాశాల సమీపంలో కారులో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన ఏడుగురు కుటుంబ సభ్యులు కారు దిగిపోయారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.
జింక మాంసం స్వాధీనం
ఆదోని సెంట్రల్: చాగి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారిణి తేజశ్విని సిబ్బందితో ఆదివారం గ్రామానికి చేరుకుని తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన చంద్రశేఖర్, హరికృష్ణ, గూళప్ప, శంకర్ జింక మాంసాన్ని వండేందుకు సిద్ధం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్లు తెలిసింది. మాంసం కృష్ణ జింకదిగా గుర్తించారు. అయితే కుక్కలు వెంబడించి జింకను చంపేశాయని పట్టుబడిన వారు చెబుతుండగా, వేటాడి చంపారా అనేది విచారణలో తేలుతుందని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎఫ్‌బీఓ బాలకృష్ణ, షఫిఉల్లా, ఏబీఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు.


