కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలోని రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో సుహృద్భావ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని కేసీ కెనాల్‌లో చెత్త వేసినా కూడా వదిలిపెట్టబోమన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా చెత్తను బాధ్యతా రాహిత్యంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, కాలువల్లో వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను పాటించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సీజనల్ హాస్టళ్లను ముందుగానే ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ యేడాది 20వేల హెక్టార్‌లో పండ్ల తోటలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు.
కొత్త బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు మినహాయింపు
కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం ప్రయోజనం పొందేందుకు కొత్తగా ఓపెన్ చేసే బ్యాంకు ఖాతాకు పాన్‌కార్డు అవసరం లేదని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు సమీపంలోని యూనియన్ బ్యాంకు లేదా కెనరా బ్యాంకులో విద్యార్థి పేరు మీద ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నెంబర్‌తో కొత్త ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. ఈ ఖాతాను తప్పనిసరిగా ఎన్‌పీసీఐతో అనుసంధానం చేయాలన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10లోగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,960 మంది అర్హులైన ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు ఎన్‌పీసీఐ లింకు ప్రక్రియ పెండింగ్‌లో ఉందన్నారు. ఆధార్‌కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీపంలోని స్వర్ణ గ్రామ /స్వర్ణ వార్డు సచివాయాలను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నారు.
తాగునీటి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
కర్నూలు(అర్బన్): జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనుల్లో వేగాన్ని పెంచి నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు సీహెచ్ మనోహర్ చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి అవసరాలకు ప్రభుత్వం ఒక్కో జిల్లా రూ.కోటి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందులో మొదటి విడతగా రూ.50 లక్షలతో జిల్లాలోని 19 మండలాల్లో 24 పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారన్నారు. ఈ నిధులతో ముఖ్యంగా బోర్ల డీపెనింగ్, ఫ్లష్షింగ్, పంపు సెట్ల రిపేర్లు, పైప్‌లైన్ల మార్పు, విస్తరణ, లీకేజీలను అరికట్టడం తదితర పనులు చేపడతామన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే ఈఈ, డీఈఈలను ఆదేశించామరు. జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తినా, వెంటనే అక్కడికి వెళ్లి సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.
ఉదయం 9.30కే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.


