టీడీపీ నేతా.. మజాకా! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతా.. మజాకా!

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

పెద్దకడబూరు: పేదల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేత డబ్బులకు కక్కుర్తి పడి పేదలను కష్టాల పాలుజేశాడు. అధికారులు సైతం టీడీపీ నేతకే మద్దతు ఇచ్చి నోటీసులు ఇవ్వడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుడు, కోసిగి మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ బొగ్గుల తిక్కన్నకు మామూళ్లు ఇవ్వలేదని తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన బొగ్గుల నరసన్న, శివయ్య, మడ్రి అనిల్‌ తదితరులు వాపోతున్నారు. ఈ మేరకు శనివారం వారంతా తహసీల్దారు వలిబాషాను కలసి తమ ఒరిజినల్‌ పట్టాలను చూపించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరు మండల కేంద్రం పరిధిలోని సర్వే నెంబర్‌ 262ఏ3లో 3.30 సెంట్లు భూమిలో దాదాపు వందేళ్లకు పైగా నివాసం ఉంటున్నారు. 2005 – 2006లో అధికారులు ఆ గుడిసెలకు పట్టాలు ఇచ్చారు. 2016లో రెవెన్యూ డివిజినల్‌ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు 262/ఏ1లో 1.16 ఎకరాలు శాన వాటిక, 262/ఏ2ఏలో 2.30 ఎకరాలు పోలీస్‌స్టేషన్‌, 262/ఏ3లో 2.50 ఎకరాలలో ఎస్సీ కాలనీ, 262/ఏ3లో 0.88 ఎకరాలలో ఓపెన్‌ సైట్‌, 262/బిలో 1.54 ఎకరాలలో ఎస్సీ కాలనీ, 262/సిలో 0.09 సెంట్లు ఎస్సీ కాలనీ మొత్తం 8.47 ఎకరాలు ఉంది. పైన కనబరిచిన ఓపెన్‌ సైట్‌లో గతంలో టీడీపీ నాయకుడు, కోసిగి మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ బొగ్గుల తిక్కన్న నకిలీ పట్టాలు సృష్టించి ఒక్కొక్కరితో రూ. 20 వేల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. ప్రస్తుతం 262/ఏ3లో 3.30 ఎకరాలలో నివాసం ఉంటున్న వారితో డబ్బులు డిమాండ్‌ చేశాడని, తమకు గతంలోనే పట్టాలు ఉన్నాయని డబ్బుల ఇవ్వమని నిరాకరించడంతో టీడీపీ నాయకుడు అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు. తహసీల్దార్‌ను కలసిన వారిలో ఎస్సీ కాలనీ వాసులు మేకల నరసన్న, మేకల షడ్రక్‌, జె.కుమార్‌, కాకి సుందరం, జె.తిమ్మక్క, మంచోది బొడ్డన్న, మేరమ్మ, జోతమ్మ, తదితరులు ఉన్నారు.

మామూళ్లు ఇవ్వలేదని

పేదల స్థలాలపై ఫిర్యాదు

అధికారులు నోటీసులు ఇవ్వడంతో

ఆందోళన

ఒరిజినల్‌ పట్టాలతో

తహసీల్దార్‌ను కలసిన బాధితులు

Advertisement
 
Advertisement
Advertisement